ఈద్ అల్-అజ్ హా లేదా ‘బక్రీద్‘ త్యాగానికి ప్రతీక…. ఒక్కో దేశంలో ఒక్కో పేరు…

19

ముస్లింలకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండుగల్లో రంజాన్ మొదటిది. ఈ పండుగ వచ్చిన 70రోజుల తర్వాత జరుపుకునే పండుగా బక్రీద్. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. ముఖ్యంగా ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతిపెద్ద పండుగగా జరపుకుంటారు.

ఈద్ అల్ – అజ్ హా లేదా ఈదజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచలోని ముస్లింలందరూ ఈ పండుగను జరుపుకుంటారు.

ఈదుల్ ఫిత్ర్(రంజాన్)లో లాగానే.. బక్రీద్ పండుగనాడు కూడా ప్రర్థనలు ఖత్బా(ధార్మిక ప్రసంగం)తో ప్రారంభమవుతాయి. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఈ పండుగను 3రోజుల పాటు చేస్తారు.

పండుగ రోజు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

ఇదే నెలలో ముస్లింలు హజ్ తీర్థయాత్ర చేస్తారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో హజ్‌ ‌తీర్థయాత్ర కూడా ఒకటి. హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుంచి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు.

ఈదుల్ అజ్ హా ను పలుదేశాల్లో పలురకాలుగా జరుపుకుంటారు…

‘ఈద్ అల్-కబీర్’: (మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, ఈజిప్టు, మరియు లిబియా)

‘ఫస్కా తమొఖ్ఖార్త్’ : (పశ్చిమ ఆఫ్రికా దేశాలలో)

‘బబ్బర్ సల్లాహ్’ : (నైజీరియా)

‘సిద్వైనీ’ : (సోమాలియా, కెన్యా మరియు ఇథియోపియా)

‘బడీ ఈద్’ లేదా బక్రీద్ : (భారతదేశం, పాకిస్తాన్)

‘వలీయా పెరున్నల్’ : (కేరళ)

‘ఖుర్బానీ ఈద్’ : (బంగ్లాదేశ్, దక్షిణాఫ్రిక)

‘పెరునాల్’ : (తమిళనాడు లో)

‘కుర్బాన్ బైరామి’ : (టర్కీ, అజర్‌బైజాన్)

‘కుర్బాన్ బజ్రామ్’ : (బోస్నియా మరియు హెర్జెగొవీనా, అల్బేనియా, కొసావో మరియు బల్గేరియా లో)

‘కుర్బాన్ బైరమే’ : (తాతారిస్తాన్)

‘కుర్బాన్ బైరామ్’ : (రష్యా)

‘కుర్బాన్ ఆయిత్’ : (కజకస్తాన్)

‘ఈద్ ఎ ఖోర్బాన్’ : (ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్)

‘లోయె అక్తర్’ లేదా ‘కుర్బానియె అక్తర్’ : (పుష్తో భాషీయులు)

‘కుర్బాన్ ఈత్’ : (చైనా మరియు ఉయ్ ఘుర్ భాషలో)

‘ఈదుల్ అద్ హా’ : (మలేషియా, సింగపూర్, ఇండోనేషియా మరియు బ్రూనై)