మహాశివరాత్రి పర్వదినాన పరమశివుడిని ఈ పూలతో అర్చించండి..!

116
maha sivarathri special

హిందువులకు పరమ పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. శివరాత్రితో చలి శివా శివా అనుకుంటూ వెళ్లిపోయేది చలి మాత్రమే కాదు, మన పాపాలు కూడా. మహాశివుడిని భక్తితో ధ్యానించి, ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షదైవంగా కొలిచి, ఆయనను అంత:కరణ శుద్ధితో అర్చిస్తే సర్వపాపాలు పరిహారమవుతాయి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మనం వేసే ప్రతీ అడుగు ఆ పరమేశ్వరుడి సంకల్పమే. అందుకే మనతో మంచిబాటలో అడుగులు వేయించమని పరమశివుడిని ప్రార్ధించుకోవడమే మన విధి.

మహాశివరాత్రి పుణ్యదినాన పరమేశ్వరుడిని సంకల్ప బలంతో ధ్యానించడంతో పాటు, ఆయనకు అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో పూజిస్తే, అద్భుత ఫలితం ఉంటుంది. మరి వేదాల్లో, శంకరుడికి ఇష్టమైన పూల గురించి ఏమేమి చెప్పారో తెలుసా..?

మారేడు దళాలు
శివుడికి అత్యంత ఇష్టమైనవి మారేడు దళాలు. “మాఱేడు నీవని ఏరేరి తేమా, మారేడు దళములు నీ పూజకు” అంటూ భక్తులు మారేడు దళములు శివభగవానునికి సమర్పించుకుంటే, ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంతే కాక, మారేడు పత్రులను త్రిమూర్తులకు చిహ్నంగా చెబుతారు పండితులు.

శంఖం పూలు
ముదురునీలం రంగులో ఉండే శంఖం పూలను కేవలం శివారాధన కోసమే ఉపయోగిస్తారు. ఈ పూలతో పూజిస్తే ఆది దంపతులు ప్రసన్నమవుతారని ప్రతీతి.

సంపెంగ పూలు
సంపెంగ పూల సువాసన ఎలా ఉంటుంది మనకు తెలుసు. కానీ ఆ వాసన దేవతలకు కూడా అత్యంత ఇష్టమైనదట. ఇవంటే దేవతలకు చాలా ప్రీతి. వీటిని పూజించే వారికి శివుడి కటాక్షం సిద్ధిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు.

జిల్లేడు పూలు
జిల్లేడు పూలను ఆయుర్వేదంలో వాడతారు. ఈ పూల వలన మనుషుల్లో జ్ఞాప‌క‌శక్తి పెరుగుతుంది. వీటి గాలి పీల్చడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే, ఈ పూలను తలపై ధరిస్తే, గత జన్మల పాపాలన్నీ నశించిపోతాయని నమ్మిక.

గన్నేరు పుష్పాలు
పసుపు రంగులో ఉండే గన్నేరు పూలను త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. స్వార్ధం, అరిషడ్వర్గాలనే దుర్గుణాలను త్యాగం చేస్తే, జీవితంలో సమతుల్యత సాధ్యమవుతుంది. కష్టసుఖాలకు కుంగిపోకుండా, పొంగిపోకుండా మనిషి నిండు కుండలా నిలబడతాడు. అందుకు సూచికగానే గన్నేరు పుష్పాలను శివపూజకు వినియోగించమన్నారు పెద్దలు.

మల్లెపూలు
సంపెంగల్లాగే, మల్లెలు కూడా అత్యంత సుగంధభరితమైన పుష్పాలు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ మనిషి మనసు ఆహ్లాదంగా మారుతుంది. వీటిని పరమశివ పూజలో ఉపయోగించి, తద్వారా మానసిక ఆహ్లాదం, ఉల్లాసం పొందవచ్చు. సువాసన కలిగే పూలను ఆ మహేశ్వరుడిని నివేదించి, చేసిన తప్పుల్ని క్షమించు స్వామీ అని వేడుకుంటే, ఆయన కరుణకు పాత్రులవుతాం.