ఈ విషయం మీకు తెలుసా: సోదరులకే కాదు.. భర్తకు కూడా రాఖీ కట్టొచ్చు…!

149
రక్షాబంధన్
రక్షాబంధన్

అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకునే రోజు ’రాఖీ‘ పండగ. ఈ రోజు సోదరీమణులు…తమ సోదరులకు రక్షాబంధన్ కట్టి.. జీవితాంతం తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఏటా ఈ రాఖీ పండగను జరుపుకుంటారు. శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఈ రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. ‘జంధ్యాల పూర్ణిమ’ అని పిలువబడే ఈ పండుగ కాలక్రమమున “రక్షాబంధన్ లేదా రాఖీ” పండుగగా ప్రాచుర్యం పొందింది.

అయితే రాఖీ పండగ రోజు రాఖీని సోదరుడికే కాక… భర్తకు కూడా కట్టొచ్చని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ కథేంటో తెలుసుకుందాం. పూర్వం దేవతలకు, రాక్షసులకు హోరాహోరీగా యుద్ధాలు సాగేవి. ఇలా పుష్కరకాలం పాటు జరిగిన ఓ యుద్ధంలో దేవతలు ఓడిపోతారు. దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై పోతాడు. దీంతో రాక్షసులకు చిక్కకుండా తన పరివారమంతటినీ కూడగట్టుకుని ‘అమరావతి‘లో తలదాచుకుంటాడు.

 ఇలాంటి సమయంలో..  భర్త నిస్సాహాయతను గమనించిన ఇంద్రాణి ‘శచీదేవి’ తగు తరుణోపాయం ఆలోచిస్తుంటుంది. ఈ క్రమంలో రాక్షసులు ‘అమరావతి’ని కూడా చుట్టుముట్టి దిగ్బంధించనున్నారని తెలుసుకుంటుంది. ఇక సహించేది లేదని, భర్త దేవేంద్రుడిని సమరోత్సాహానికి పురికొలుపుతుంది. సరిగ్గా అదే రోజు ‘శ్రావణ పూర్ణిమ’ కావడంతో… పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణలను పూజించిన ‘రక్షా’ దేవేంద్రుడి చేతికి కడుతుంది.

     అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రుడి చేతికి కడతారు. అలా ఇంద్రుడి విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి ‘త్రిలోకాధిపత్యాన్ని’ పొందుతారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన ‘ఆ రక్షాబంధనోత్సవం’ నేడు అది ‘రాఖీ’ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు భార్య లేదా సోదరికి నూతన వస్త్రాలు, చిరుకానుకలు సమర్పించి, అందరూ కలిసి చక్కని విందు సేవిస్తారని పురోహితులు అంటున్నారు.