మంగళవారం ప్రత్యేకం: కొండగట్టు ఆంజనేయ పుణ్యక్షేత్ర దర్శనం

135
Kondagattu anjaneya swamy temple special
Kondagattu anjaneya swamy temple special

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
తృణీభూత హేతిం రణోద్వద్విభూతం
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్

ప్రశాంతతే ఆభరణంగా కలవాడు, శ్వేతవర్ణ తేజస్సు కలిగిన వాడు, మొత్తం విశ్వాన్నే వణికించగల శౌర్యం ఉన్నవాడు, హిమవన్నగం కంటే ధైర్యం కలవాడు, సదా విజయలక్ష్మి వెంట ఉండెడి వాడు, అత్యంత పవిత్రమైన వారే ఆప్తమిత్రులుగా కలవాడు, వాయిపుత్రుడు శ్రీ హనుమంతుడికి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్ధం. ఆంజనేయుడు ఉన్న చోట భయానికి చోటు ఉండదు. ఆయన నామస్మరణే సర్వభవభయ హరణం. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అభయాంజనేయుడి ఆలయాలున్నాయి. అలాంటి వాటిలో ప్రత్యేకమైనది తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆలయం.

కరీంనగర్ లోని మల్లాల మండల కేంద్రంలో ముత్యంపేట ఊరికి 35 కిలోమీటర్ల దూరంలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ ఆంజనేయ ఆలయం. ప్రకృతి సౌందర్యం అణువణువునా ఉట్టిపడే కొండగట్టుకు జానపదాల్లో మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే, సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మిక. పురాణాలప్రకారం చూస్తే రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సమయంలో, హనుమంతుడు సంజీవని తీసుకొస్తాడు. ఆయన ఆ పర్వతాన్ని తీసుకొస్తున్న సమయంలో ముత్యంపేటలో కొంతభాగం విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టు పర్వతంగా పిలుస్తున్నారు.

Image result for kondagattu anjaneya swamy

మరో కథ ప్రకారం, నాలుగు వందల ఏళ్ల క్రితం సింగం సంజీవుడు అనే ఆవుల కాపరి, ఆవులను మేపుకుంటూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. మందలో ఒక ఆవు తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ అలసిపోయిన అతనికి ఒక పెద్ద చింతచెట్టు కనిపించింది. సేదతీరడం కోసం ఆ చెట్టుకింద నిద్రపోయిన అతనికి కలలో ఆంజనేయస్వామివారు కనిపించి, తాను పక్కనే పొదల్లో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముళ్ల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి అదృశ్యమయ్యారు. కళ్లు తెరిచి చూసిన సంజీవునికి ఎదురుగా తప్పిపోయిన ఆవు కనిపించడంతో ఆనందంతో అవధుల్లేకుండా పోయాయి. వెంటనే పక్కనే ఉన్న పొదల్ని తొలగించి చూడగా, శంఖు చక్ర గదాధారుడై శ్రీ ఆంజనేయస్వామి వారు నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపం చూసి వెంటనే స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు.

Image result for kondagattu anjaneya swamy

స్వామివారం ముఖం రెండు ముఖాలతో వేంచేసి ఉండటం కొండగట్టు ప్రత్యేకత. ఈ విధంగా రెండు ముఖాలతో స్వామివారు మరెక్కడా వెలిసినట్టు చరిత్రలో లేదు. ఆంజనేయస్వామి వారికి నారసింహ వక్త్రం, శంఖుచక్రాలు, ఆయన వక్షస్థలంలో శ్రీసీతారామ స్వరూపాలు ఉండటం ఈ విగ్రహ ప్రత్యేకత. ఈ క్షేత్రానికి శ్రీ భేతాళస్వామి పాలకుడిగా ఉన్నారు. పరమ పవిత్రమైన కొండగట్టు పుణ్యక్షేత్రంలో మరెన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. అటవీ మార్గం గుండా కొండపైకి మెట్లదారి, భేతాళ ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయుని గట్టు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అమ్మవారి ఆలయం, శ్రీరామ పాదుకలు వంటి ఎన్నో ఆధ్యాత్మిక స్థలాల్ని ఇక్కడ సందర్శించుకోవచ్చు.

Related image

కొండగట్టులో ఏటేటా శ్రీసీతారాముల కళ్యాణం, కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వారా దర్శనం, విజయదశమి, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం, శ్రీ సుదర్శన యాగం వంటి ఉత్సవాలన్నింటినీ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. కొండగట్టు కు 175 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం ఉంది. కరీంనగరం రైల్వే స్టేషన్ కొండగట్టుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి కొండగట్టుకు బస్సులు నడుస్తుంటాయి.