సద్గురు సాయినాధుని ఆరాధనతో అనుగ్రహాన్ని పొందడమెలా..!

111
Sri Sai baba worship on Thursday
Sri Sai baba worship on Thursday

గురువారం..అంటే సాక్షాత్తూ గురుదేవులకు ప్రత్యేకమైన రోజు ఇది. మానవాళి ఆ శ్రీకృష్ణపరమాత్ముడిని జగద్గురుగా కొలుస్తారు. అదే స్థాయిలో మానవ జన్మలు పునీతం చేయడానికి శ్రీ సాయిదేవునిగా అవతరించాడు ఆ సర్వాంతర్యామి. నిరాండబర జీవితం, నిర్మలమైన మనస్సు మోక్షాన్ని సాధించడానికి సోపానాలని సాయి బోధించారు. ఆయన అనుగ్రహం పొందాలంటే పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. మన:కరణ శుద్ధితో ఒక్క అరటిపండు సమర్పించినా, చక్కెల పలుకు పెట్టినా ఆనందంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా గురువారం నాడు సాయిబాబాను స్తుతించి, దీపాలు వెలిగించే వారికి సర్వ సుఖాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీటి కంటే ముఖ్యంగా, గురుదేవుల అనుగ్రహంతో చక్కటి బుద్ధిబలం చేకూరుతుంది.

స్వయంగా సద్గురు సాయి మానవజీవితం గురించి చెప్పిన బోధ ఏమిటో తెలుసా..? “మానవజన్మ ఉత్కృష్టమైనది. పుట్టడం, బతకాలి కాబట్టి బతకడం, కాలయాపన చేసి తిరిగి గతించడం.. ఇదే మనిషి జన్మైతే దానికి ఎటువంటి విలువ లేదు. ఒక కొండరాయికి, మనిషికి ఉన్న తేడా ఏంటంటే, అది జ్ఞానాన్ని సముపార్జించలేదు. మనిషి జ్ఞానాన్ని పొందగలడు. పరమార్ధిక చింతనతో జీవితాన్ని గడపగలడు. అందుకే జీవితంలో ఒక ఆధ్యాత్మిక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. తనను తానే తెలుసుకోలేని మనిషి, ఆ పరమాత్ముడినెలా తెలుసుకుంటా..? గమ్యం తెలిసిన వాడే మానవడు. దాన్ని చేరుకునే వాడే సాధకుడు ” అని సాయిబాబా అన్నారు. అందుకే, శ్రీసాయిని మనసా, వాచా, కర్మణా ధ్యానించి లక్ష్యసిద్ధికై ముందడుగు వేస్తే, మంచి ఫలితాలు లభిస్తాయి. మనసు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుని మనసారా ధ్యానించి, కార్యసిద్ధికోసం శ్రమిస్తే, మానవయత్నానికి తోడు భగవత్సంకల్పం తోడవుతుంది. విజయం వరిస్తుంది. ప్రశాంతత లభిస్తుంది.