ముక్కోటి ఏకాదశి ఎందుకు అంత పవిత్రమైనదంటే..!

629
the speciality of mukkoti yekadasi

హిందువులందరూ పరమపవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 29 న వచ్చింది. ఈ రోజున భక్తులు వైష్ణవాలయాలకు క్యూ కడతారు. ఉత్తరద్వార దర్శనంలో విష్ణుమూర్తిని కొలుచుకుని తరించాలని ఆరాటపడతారు. అసలు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే…

ధనస్సు నెల మొదలైన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది. వైష్ణవులకు, మధ్వమతస్తులకు చాలా ముఖ్యమైనది. అయినప్పటికి దీనిని హిందువుల్లో అన్ని కులాలవారు విరివిగా పాటిస్తారు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవం గా వ్యవహరిస్తారు పెద్దలు. ఈ ఏకాదశి రోజున మూడు రకాలైన ప్రత్యేకతలున్నాయి.

స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠనాథుడి ఆగమనం అనే మూడు కారణాలు, ఈ ఏకాదశిని విశిష్టస్థానంలో నిలుపుతున్నాయి. మొదటిది అయిన స్వర్గ ద్వారం విషయానికొస్తే, దక్షిణాయణంలో కన్నుమూసిన పుణ్యాత్ములందరికీ ఈ ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరవబడతాయట. వీరందరూ ఈరోజునే స్వర్గప్రవేశం చేస్తారని నమ్మిక. అందుచేత ఈ ఏకాదశికి స్వర్గద్వార ఏకాదశి అనే నామం కూడా ప్రాచుర్యంలో ఉంది.

ఇక ముక్కోటి ఏకాదశి అంటే మూడుకోట్ల ఏకాదశులతో సమానమైన శక్తి కలది కాబట్టి ఆ నామం వచ్చిందని కొంతమంది నమ్మితే, విష్ణుమూర్తి ముక్కోటి దేవతలు వెంటరాగా, భూమిమీద అడుగుపెట్టి, ముర అనే అసురుడిని సంహరించాడు కాబట్టే ఇది ముక్కోటి ఏకాదశిగా మారిందని ప్రతీతి. కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తుండేవాడు. తపస్సు చేసి సాధించిన వరగర్వంతో దేవతల్ని సైతం గడగడలాడిస్తూ, యజ్ఞాల్ని నాశనం చేస్తుండటంతో, దేవతలు, ప్రజలు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. దీంతో సకలదేవతలు వెంటరాగా, వైకుంఠం నుంచి భూమిమీద అడుగుపెట్టిన విష్ణుమూర్తి మురాసురుడిని అంతం చేశాడు. అందుకే ఆయనకు మురారి అన్న పేరు వచ్చిందని చెబుతారు. ఆయన అలా ముక్కోటి దేవతలతో వచ్చిన రోజు కాబట్టి, ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందని నానుడి. వైకుంఠ ద్వారాలు తెరచుకుని స్వయంగా ఆ వైకుంఠనాథుడే తరలివచ్చిన ఏకాదశి కావడంతో, వైకుంఠఏకాదశి అన్న పేరు వచ్చింది.

ఇలా ఇన్ని పేర్లు కలిగిన ఈ మహోత్తర దినమున ఉత్తరద్వారం నుంచి విష్ణుదర్శనం ఉత్కృష్టమైందని పెద్దలు చెబుతుంటారు. అలా దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ లభించదని నానుడి.