టాలీవుడ్ లో హాస్యత్రయం శకం ముగిసిందా?

122

టాలీవుడ్.. ఎక్కువ సినిమాలు పురుడు పోసుకుంటున్న చిత్ర పరిశ్రమ. మన చిత్ర పరిశ్రమలో ఉన్నంతమంది హాస్యనటులు దేశంలోని మరేఇతర చిత్ర పరిశ్రమల్లోనూ లేరు. అలనాటి కాలంలో రేలంగి, రమణారెడ్డితో కొనసాగిన నవ్వులు.. రాజ బాబు, బ్రహ్మానందం, ఆలీ.. నిన్నమొన్నటి కమోడియన్లు.. వెన్నెల కిషోర్ వరకు పువ్వులుగా విరస్తూనే ఉన్నాయి. దాదాపు 80ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యానికే పెద్దపీట. ముఖ్యంగా జంద్యాల, ఈవీవీ సత్యన్నారాయణ లాంటి దర్శకులు.. తమ సినిమాల పొలాల్లో హాస్య పంటలు సాగుచేసి.. ఎంతోమంది హాస్య కూలీలకు అవకాశం కల్పించారు. వారి ప్రతిభను వెలికితీశారు.

వారిలో ముఖ్యంగా.. నాన్నల తరానికి.. యువతరానికి వారధిలా నిలిచిన బ్రహ్మానందం, ఆలీది ఒక చరిత్రే. ఆలీది 40ఏళ్ల సినీ ప్రస్థానం అయితే.. బ్రహ్మానందానిది 35 ఏళ్ల హస్యనట ప్రయాణం. బ్రహ్మానందం అయితే అత్యధిక సినిమాల్లో(1000) నటించిన హాస్యనటుడి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ అడుగు పెట్టి.. తనదైన మేనరిజమ్, టైమింగ్ తో హస్యాన్ని పండించిన నటుడు రాజమండ్రి కుర్రాడు ఆలీ. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు వీరితో నటించని హీరో లేరు.. ఏడాదికి ఒక వంద సినిమాలు విడుదలైతే.. అందులో దాదాపు 90శాతం వీరిద్దరు కన్సిస్తారు. అలాంటి ఈ హస్య చక్రవర్తుల ప్రభావం ప్రస్తుతం కోల్పోతున్నారనేది వాస్తవం. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ నటించి, హాస్యాన్ని పండించిన సినిమాలు చెప్పాలంటే వేళ్ల మీదే లెక్కించవచ్చు. టాలెంట్ ఉన్న అప్ కమింగ్ కమెడియన్ల తాకిడి పెరిగిపోవడం.. పాత చింతకాయ పచ్చడిలాగా ఆలీ, బ్రహ్మానందం కామెడీ రోటీన్ గా ఉండటంతో దర్శకులు కూడా కొత్తవారిపై మొగ్గు చూపుతున్నారు. పైగా బ్రహ్మానందం, ఆలీ రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండటంతో నిర్మాతలు కూడా వారిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నరట.

ఒక్క రోజు బ్రహ్మానందానికి ఇచ్చే రెమ్యూనరేషన్ తో నలుగురు అప్ కమింగ్ కమెడీయన్ల ను సినిమాలోకి తీసుకోవచ్చని డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో కొత్తవారికే ప్రాధాన్యం ఇస్తున్నారట. బ్రహ్మానందం లాంటి కమెడియన్ గంటకు రూ.2 నుంచి 3లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటారట. దీంతో ఒక పది రోజుల వీరి కాల్ షీట్లకు.. ఒక చిన్నహీరో రెమ్యూరేషన్ అంత ఇవ్వాల్సి వస్తోందట. టాలెంట్ ఉన్న కొత్త కమెడియన్లు అయితే అవకాశం ఎదురుచూస్తుంటారు.. పైగా రెమ్యూనరేషన్ కూడా వారు పెద్దగా డిమాండ్ చేయరు.. అనేది నిర్మాతల వాదన. వీరిలో ఫన్ బక్కెట్..లాంటి యూటూబ్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ లాంటి టీవీ కామెడీ షోలలో తమ టాలెంట్ ను నిరూపించుకున్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక మొదటి నుంచి సినిమాల్లోనే ఉన్నసప్తగిరి, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లకు కూడా డిమాండ్ బాగానే ఉంది.

ఇక గత నంద్యాల బై ఎలక్సన్స్ లో ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన.. హాస్య నటుడు వేణుమాధవ్ కు దాదాపు సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ దివంగత నేత ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచార సభలో ఆకట్టుకున్న వేణుమాధవ్ అనంతరం కమెడియన్ కూడా రాణించారు. వీవీ వినాయక్ లాంటి దర్శకులైతే.. వేణుకు అధిక ప్రాధన్యం ఇచ్చారు.. దీంతో ఓ వెలుగు వెలిగిన వేణు మాధవ్ గత ఐదేళ్ల నుంచి చేసింది చాలా తక్కువ సినిమాలే. ఈ మధ్య సినిమాలు తగ్గి పోవడంతో ఆయన ఆరోగ్యంపై వచ్చిన పుకార్ల కారణంగా ఆయన మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు.

తనదైన హావాభావాలు.. సౌండ్స్ తో ఎంద చాట అంటూ గిలిగింతలు పెట్టినా.. బీదర్లో ఇసుక చల్లూతా అన్నా.. అది ఆలీకి మాత్రమే చెల్లింది. మెగాహీరోలకు అభిమాన కమెడియన్ అయిన ఆలీకి కూడా ప్రస్తుతం అంతగా అవకాశాలు లేవనేది వాస్తవం. ఈ మధ్య అలీకి ఆయన అభిమాన నటుడైనా.. పవన్ కల్యాణ్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే అజ్ఒతవాసి సినిమాలో అలీని తీసుకోలేదని వార్తలు వచ్చాయి. దాదాపుగా పవన్ చేసిన అన్నీ సినిమాల్లోనూ ఆలీ తప్పనిసరిగా ఉంటాడు. ఆలీకి సినిమా అవకాశాలు తగ్గడానికి.. పవన్ కల్యాణ్ తో ఉన్న మనస్సర్థలు కూడా ఒక కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో తనను ఓ దర్శకుడు సినిమాలోకి తీసుకుంటానని చెప్పి.. అంతనరం వేరే వాళ్లను తీసుకుంటామని చెప్పడం తనను బాధించిందని ఆలీ బాధపడ్డారు కూడా.

ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో.. ఆలీ టీవీ షోలకు పరిమితమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్రహ్మానందం, ఆలీ కలిసి నటించి హాస్యం పండించిన సినిమా అంటే చెప్పుకోవాల్సింది.. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ 150 మాత్రమే. అనంతరం బాలయ్యబాబు నటించిన జయ సింహాలో నటించినా.. అంతగా ఆకట్టుకోలేకపోయారు.