ఈ యాప్ లు ఉంటే..వాట్సాప్ ను మర్చిపోతారు!

13

ఫేస్ బుక్ తో పాటే మన జీవితంలో అంతర్భాగమైపోయింది వాట్సాప్. సందేశాలు పంపుకోవడానికి నెట్ వర్క్ ఛార్జిలు ఎక్కువ పడుతున్న తరుణంలో వాట్సాప్ ఒక ప్రత్యామ్నాయంగా దొరికింది. మేసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ను కొట్టేది లేదు. అయితే గత కొన్నాళ్లుగా ఫేక్ మెసేజ్ లు, తప్పు లేకపోయినా గ్రూపు అడ్మిన్లపై కేసులు, డేటా చోరీ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో వాట్సాప్ కాకుండా వేరే యాప్ లేదా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా కొన్ని యాప్ లు ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి.

హైక్:

మొదలైన కొత్తలో దాదాపు వాట్సాప్ తో సమాంతరంగా నడిచిన ఈ యాప్, తర్వాతి కాలంలో వెనుకబడిపోయింది. ఇప్పటికీ చాలామంది హైక్ లో ఉన్నారు. ప్రైవసీకి భద్రత కల్పించడం హైక్ లో ప్రత్యేకత. యూజర్స్ తమ ప్రైవేట్ చాట్స్ అందరికీ కనిపించకుండా పాస్ వర్డ్ పెట్టుకునే ఆప్షన్ ఆకర్షణగా నిలుస్తుంది. చాట్ చేసుకునేప్పుడు పంపించడానికి అనేక రకాలైన స్టిక్కర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక క్రికెట్ ప్రియులకు లైవ్ స్కోరు, వార్తాప్రియులకు న్యూస్ అప్ డేట్స్ వంటి చాలా ఫీచర్స్ హైక్ లో ఉన్నాయి. వాట్సాప్ వాడకూడదనుకున్న వారికి హైక్ మంచి ప్రత్యామ్నాయ ఛాటింగ్ యాప్.

టెలిగ్రామ్:
పంపించిన సందేశాలు ఎవరూ చూడటానికి వీలులేకుండా ఎన్ క్రిప్షన్ పద్ధతిని అనుసరించే ఏకైక యాప్ టెలిగ్రామ్. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పనిచేయడం దీని ప్రత్యేకత. మొబైల్ ఫోన్, కంప్యూటర్ వంటి అనేక ఫ్లాట్ ఫాం లను అనుసంధానిస్తూ రియల్ టైమ్ సింక్రొనైజేషన్ తో టెలిగ్రామ్ పనిచేస్తుంది. అంటే.. మీరొక సందేశాన్ని టైప్ చేస్తూ ఫోన్ లో మధ్యలో ఆపేశారనుకోండి.. దాన్ని మీ కంప్యూటర్ లో టెలిగ్రామ్ లో పూర్తి చేసుకోవచ్చు. కొత్త ఫోన్ కొంటే వాట్సాప్ పాత హిస్టరీ అంతా అందులో రాదు. కానీ టెలిగ్రామ్ లో మాత్రం లాగిన్ అయితే చాలు, పాత ఫోన్ లో ఉన్న చాట్ లు ఉన్నవి ఉన్నట్లుగా వచ్చేస్తాయి.

సిగ్నల్:
“ప్రైవసీ అనేది సాధ్యమే. సిగ్నల్ ఆ పద్ధతిని సులభతరం చేస్తుంది.” ఇదీ సిగ్నల్ యాప్ మూల సూత్రం. అన్ని ఫీచర్లు దాదాపు వాట్సాప్ లాగే ఉంటాయి కానీ.. ప్రైవసీ విషయంలో దాని కంటే చాలా భద్రతను కల్పిస్తుంది. ఆఖరికి మనం పంపే మీడియాలో సైతం ప్రైవసీ ఉండేలా, డేటాకు భద్రత కల్పించడంలో సిగ్నల్ యాప్ ముందుటుంది. మిగిలిన యాప్స్ లా యూజర్స్ డేటాను సిగ్నల్ తన సర్వర్లలో స్టోర్ చేసుకోదు.