ఉగాది రోజున ఏం చేస్తే మంచిది..?

18
2018 మార్చి 18న ఉగాది పండగ రాబోతోంది. చాలామందికి ఉండే సందేహం, ఉగాది రోజున అసలు ఏం చేయాలి..? ఏమైనా చేయకూడనివి ఉన్నాయా..లేదా ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నాయా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలా..ఇంకెందుకు లేటు..చదివేయండి మరి..
ఉగాది రోజున ఉదయానే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, సూర్యోదయానికి పూర్వమే తలకు నూనె రాసుకుని, తలస్నానం చేయాలి. పండుగ దినాల్లో నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెబుతారు. అందుకే ఉగాది రోజున లక్ష్మీ దేవి కటాక్షానికి, గంగమ్మ కరుణకు పాత్రులయ్యే విధంగా ఈరోజున ఇలా చేయాలని చెబుతారు. ఇక తలస్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకుని, ఇంటిని శుభ్రపరుచుకుని, మామిడాకులతో అలంకరించుకుని, గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. తులసిచెట్టుకు పూజచేసుకోవడం అత్యంత శుభప్రదం. లక్ష్మీదేవికి, విష్ణుదేవునికి తులసిమాల సమర్పించుకోవడం శ్రేయస్కరం. ఇక షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి నైవేద్యం సరేసరి. పూజ పూర్తైన తర్వాత మన అహాన్ని విసర్జిస్తూ, సర్వేశ్వరునికి సాష్టాంగపడి నమస్కరించాలి. పూజవిధానం భక్తి శ్రద్ధలతో చేసిన పిదప, పంచాంగశ్రవణం చేసుకోవాలి. లేదా పంచగ శ్రవణం విన్నా అద్భుతఫలితాలుంటాయి. ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పూజ పూర్తైన తర్వాత నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని భుజించాలి. ప్రపంచంతో పాటు, మనమూ సుఖంగా, క్షేమంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అందరిలో మనముండాలని భగవంతుని ప్రార్ధించి, ఉగాది కొత్త ఆశలకు చిగురువేయాలని కోరుకోవాలి.