త్రివిక్ర‌మ్ కాస్త టైమ్ అడుగుతున్నాడు.. 

0

కెరీర్ లో ఎప్పుడూ ప‌డ‌ని డిజాస్ట‌ర్ క‌దా.. అందుకే త్రివిక్ర‌మ్ డీప్ షాక్ లోకి వెళ్లిపోయాడు. ఆకాశ‌మంత అంచ‌నాల‌తో వ‌చ్చిన అజ్ఞాత‌వాసి అడ్ర‌స్ లేకుండా పోయాడు. ఈ చిత్రం ఇచ్చిన షాక్ తో త్రివిక్ర‌మ్ పైనే లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. అయితే ఒక్క ఫ్లాప్ తో ఆయ‌న టాలెంట్ త‌క్కువ అంచ‌నా వేయ‌డం మాత్రం పొర‌పాటే అవుతుంది. ఆ విష‌యం ఎన్టీఆర్ కు కూడా తెలుసు. అందుకే ఈ చిత్రంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతున్నాడు ఎన్టీఆర్. ప‌నిలో ప‌నిగా త‌నకు కావాల్సింది కూడా అడిగేసాడు. ఈ చిత్రం కోసం అనిరుధ్ ను కాకుండా దేవీని తీసుకోవాల‌ని త్రివిక్ర‌మ్ ను ఎన్టీఆర్ కోరిన‌ట్లుగా తెలుస్తుంది. ఇక త్రివిక్ర‌మ్ కూడా త‌న స‌మ‌స్య‌ను ఎన్టీఆర్ కు చెప్పుకున్నాడు.

 అవును.. త్రివిక్ర‌మ్ కు ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. అదే బ‌రువు స‌మ‌స్య‌. ఒక‌ప్పుడు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు. త‌ర్వాత యమ‌దొంగ నుంచి స‌న్న‌బ‌డ్డాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బ‌రువు పెరిగాడు. టెంప‌ర్ టైమ్ నుంచి కాస్త బ‌రువు పెరిగి బొద్దుగా క‌నిపిస్తున్నాడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన జై ల‌వ‌కుశ‌లోనూ ఓ పాత్ర కోసం కాస్త లావ‌య్యాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ త‌న సినిమా కోసం తార‌క్ ను బ‌రువు త‌గ్గించాల్సిందిగా కోరాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ చిత్రం మొద‌లైంది. ముహూర్తం అయితే పెట్టారు కానీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ నుంచి మొద‌లుకానుంది. ఈ క‌థ విష‌యంపైనే బిజీగా ఉన్నాడు త్రివిక్ర‌మ్.

క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఎన్టీఆర్ కాస్త బ‌రువు త‌గ్గాల్సిందే అని చెప్పాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఇదే ప‌నిపై బిజీగా ఉన్నాడు జూనియ‌ర్. ఈ మ‌ధ్యే యూర‌ప్ వెళ్లి వ‌చ్చేసాడు తార‌క్. ఇటీవ‌ల చ‌ర‌ణ్ ఇంట్లో జ‌రిగిన క్రిస్ మ‌స్ పార్టీకి వ‌చ్చిన ఎన్టీఆర్ చాలా బొద్దుగా క‌నిపించాడు. బ‌హుశా అందుకేనేమో త‌న సినిమా కోసం కాస్త త‌గ్గ‌మ‌ని సూచించాడు త్రివిక్ర‌మ్. షూటింగ్ కు ఇంకా మూడు నెల‌లు టైమ్ ఉండ‌టంతో కావాల్సిన‌ట్లుగా మారిపోవ‌డానికి రెడీగా ఉన్నాడు యంగ్ టైగ‌ర్. చాలా ఏళ్ల నుంచి త్రివిక్ర‌మ్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇన్నాళ్ల‌కు ఆ ఛాన్స్ దొరికింది. అందుకే మాట‌ల మాంత్రికుడు ఏం చెబితే దానికి సై అంటున్నాడు ఎన్టీఆర్. మ‌రి ఈ చిత్రంతో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ త‌న మార్క్ చూపిస్తాడో లేదో చూడాలిక‌..!