న్యాయం చేయండి.. కూతురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సీనియర్ నటుడు..!

0

    తెలుగు, తమిళ సినిమాల్లో తండ్రి పాత్రల్లో మెప్పించిన సీనియర్ నటుడు విజయకుమార్ తన కూతురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిని షూటింగ్ కోసమని అద్దెకు తీసుకుని ఖాళీ చేయడం లేదంటూ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి కూతురు వనితపై స్థానిక మధురవాయిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మధురవాయిల్, అలపాక్కమ్ లో్ని అష్టలక్ష్మి నగర్ లోని 11వ వీధిలో విజయకుమార్ కు ఇల్లు ఉంది. ఆ ఇంటిని షూటింగ్ లకు అద్దెకు ఇస్తూ, తాను తన కొడుకు అరుణ్ తో కలిసి కొట్టివక్కమ్ లో నివాసం ఉంటున్నట్లు ఆయన తెలిపారు. వారం రోజుల క్రితం తన కూతురు వనిత షూటింగ్ కోసమని అలపాక్కమ్ లోని ఇంటిని అద్దెకు అడగడంతో ఇచ్చినట్లు తెలిపారు. షూటింగ్ పూర్తి అయినా కూడా వనిత తన ఇంటిని ఖాళీ చేయడం లేదని.. అడిగితే రౌడీలు, న్యాయవాదులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు.

విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్‌ పోలీస్‌ కమిషనర్‌ విచారణ ప్రారంభించారు. ఈ మేరకు గురువారం పోలీసులు విజయకుమార్‌ ఇంటికి వెళ్లి.. వనితను విచారించారు. అయితే ఆ ఇంట్లో తనకూ భాగం ఉందని, ఖాళీ చేయనని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఇల్లు మీదనడానికి ఆధారాలుంటే చూపాలని పోలీసులు కోరారు. ఇంతలో విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. దీంతో వనిత మీడియా వాళ్లపై ఫైర్ అయ్యింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది. పోలీసులు విజయకుమార్, వనితల కేసును విచారిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వనిత కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.