గుండెపోటుతో మరణిస్తే, శరీరంపై గాయాలేందుకున్నాయి?

1

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు వైసీపీ కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంలో వివేకా చురుగ్గా పాల్గొన్నారు. కడప జిల్లా చాపాడు మండలం మద్దూరులో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే పరిస్థితి లేదని వివేకా కుటుంబసభ్యులు, అనుచరులు అంటున్నారు.

గతంలో ఆయనకు గుండె జబ్బులు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఆయన తలకు గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు, అనుచరులు ఫిర్యాదు చేశారు. బాత్ రూమ్ లో కాలు జారిపడి తలకు గాయాలు కావడంతో చనిపోయారా మరో కారణమా అనేది పోలీసుల విచారణ, పోస్టుమార్టం అనంతరం తెలియనుంది. శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూమ్ కి వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాత్ రూమ్ లోకి వెళ్లి చూశారు.

అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న వివేకాను చూసి వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివేకా తలపై గాయాలు ఉండటం గమనించారు. అసలేం జరిగింది? అనేది వారికి అర్థం కాలేదు. కాగా, గుండెపోటుతో వివేకానందరెడ్డి హఠానర్మణం చెందారని, పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని వార్తలు వచ్చాయి. ఇంతలోనే కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.