రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు లోను కాకండి..

0

నైతిక విలువలతో కూడిన ఓటింగు ద్వారా నీతివంత‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకోవ‌చ్చ‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జాయింట్ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన‌ ఎన్నికల నిఘా వేదిక సభ్యుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ప్రలోభాలకు తావు లేని ఎన్నికలతోనే పటిష్ఠ ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. ఎన్నికలప్పుడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలు రాజకీయ పార్టీల నాయకులు యత్నిస్తుంటారని, అలాంటి వాటికి ప్రజలు లోను కాకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన ఓటింగ్‌ విధానంపై మండలస్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

సార్వత్రిక ఎన్నికల భద్రత చర్యల్లో భాగంగా జిల్లాకు వస్తున్న కేంద్ర బలగాలకు అవసరమైన భోజన, వసతి సౌకర్యాలను కల్పించాలని జేసీ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. కేంద్ర బలగాల వసతి సౌకర్యాలపై ఏఎస్పీ ఈశ్వరరావుతో కలెక్టరేట్లో చర్చించారు. జిల్లాలో ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించడానికి కేంద్ర బలగాలను కేంద్ర ప్రభుత్వం పంపిస్తోందని, కేంద్ర బలగాలకు విధులు కేటాయించిన ప్రాంతాల్లో విశాలమైన వసతితో పాటు నాణ్యమైన భోజన సదుపాయాలను కల్పించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఈశ్వరరావు, ప్రత్యేక బ్రాంచి డీఎస్పీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.