ఎంపీ సీఎం ర‌మేష్ కు త‌ల‌నొప్పిగా మారిన వాట్సాప్ నిర్ణ‌యం

0

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ తీసుకున్న సంచలనం నిర్ణయం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ కు త‌ల‌నొప్పిగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము అందించే ఉచిత సేవ‌ల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ రాజ‌కీయ పార్టీల‌కు వాట్సాప్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో తమ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాంను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశంతో వాట్సాప్ లో కొన్ని మార్పులు చేప‌డుతున్న‌ట్లు సూచించింది. ఎన్నికల కమిషన్‌, ఇతర అధికారులతో చర్చిస్తామ‌ని అనంతరం ఈ ప్రక్రియను మరింత విస్తరిస్తామని వెల్లడించింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ వాట్సప్ అకౌంటును వాట్సప్ సంస్థ బ్యాన్ చేసింది. సీఎం రమేష్‌కు వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారంటూ వివరణ ఇచ్చింది. అయితే వాట్సాప్ వ్య‌వ‌హారంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన ర‌మేష్ స‌ద‌రు సంస్ధకు లేఖ రాశారు.

ఆ లేఖ‌పై స్పందించిన వాట్సాప్ ప్ర‌తినిధులు త‌మ‌కు ఫిర్యాదులు అందడంతోనే ఖాతాను బ్యాన్ చేశామని స్పష్టం చేశారు. కాగా వాట్సప్ తొలగింపు వెనుక కేంద్ర ప్రభుత్వ చర్యలే కారణమని సీఎం రమేష్ అనుమానం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తన ఫోన్.. వాట్సాప్ పై కేంద్రం నిఘా పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చుండొచ్చని సీఎం రమేష్ అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.