స్టార్ ‘మా’ ఛానెల్ పై కేసు నమోదు..! పెద్దాపురాన్ని అవమానించారు..!

156
case registered Tollywood squares program derogatory comments Peddapuram tallabathula sai
case registered Tollywood squares program derogatory comments Peddapuram tallabathula sai

పెద్దాపురాన్ని అవమానించారు..!

స్టార్ మా టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అవుతున్న టాలీవుడ్ స్క్వేర్స్ అనే కార్యక్రమంపై రోజురోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో, కొన్ని వర్గాల వారిని అవమానించే విధంగా పార్టిసిపెంట్స్ తీరు ఉంటోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో పెద్దాపురం గ్రామాన్ని, ఆ ఊరికి చెందిన గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత తాళ్లాబత్తుల సాయిని అవమానించారంటూ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదైంది. సోషల్ మీడియా ఫర్ సొసైటీ, మన పెద్దాపురం ఫేస్ బుక్ టీం సభ్యులు ఈ కంప్లైంట్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.

“10-03-2018 శనివారం స్టార్ మా టెలివిజన్ ఛానెల్ లో రాత్రి 9:30 నిముషాలకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో పెద్దాపురం గ్రామాన్ని, అలాగే గ్రామంలో పుట్టి సూక్ష్మ కళాఖండాల సృజనలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సాధించిన డా. తాళాబత్తుల సాయి గారిని అవమానించారు. ప్రోగ్రామ్ కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో కూడా అప్ లోడ్ చేశారు. మొత్తం 41.36 నిముషాల మొత్తం కార్యక్రమంలో 10.30 నుంచి 12.30 వరకూ వారి అపహాస్యం కనబడుతుంది. షో కు హోస్ట్ గా చేస్తున్న నటుడు, పెద్దాపురం లో తాళ్లాబత్తుల సాయి దగ్గర ఏది చిన్నగా ఉండటం వలన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు అని వేసిన ప్రశ్న వేయడం, షో లో పార్సిటిపేట్ చేసిన వారు వెకిలి సమాధానాలు చెప్పడం పెద్దాపురం గ్రామస్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా ఉంది.”

“ఆ ప్రశ్నకు బదులిస్తూ జబర్దస్త్ ఫేమ్ వేణు నాకు ఫిల్మ్ నగర్ సాయి గాని దగ్గర ఏముందో తెలియదు పెద్దాపురం సాయిగాని దగ్గర ఏముందో నాకెట్టా తెలుస్తదయ్యా అంటూ అవమానించడమే కాకుండా ఆ సాయిగాడు ఏమి పెద్దది పెంచుకున్నాడో ఏమి చిన్నది పెంచుకున్నాడో అంటూ బూతు అర్ధం వచ్చేలా ఏకవచనంతో మాట్లాడడం మధ్యలో జబర్దస్త్ ఫేమ్ ధనరాజు ఇతర కమెడియన్లు అరె పెద్దాపురం రా పెద్దాపురం అంటూ అవహేళనగా మాట్లాడడం… దానికి బదులుగా జబర్దస్త్ ఫేమ్ వేణు ఆ సాయిగాడు నాకు తెలియకుండా పెద్దాపురంలో చిన్నగా ఏమి చేస్తున్నాడో అంటూనే… చిన్న ఎలుకల బోను తయారు చేసాడు ఎక్కడో ఆర్టికల్ చదివా అనడంతో బిగ్ బాస్ ఫేమ్ హరితేజా కల్పించుకుంటూ అందరూ దరిద్రపు ఆర్టికల్స్ చదివే ఉంటారు అనడం… అంతకు ముందు ప్రభాకర్ మధ్యలో పెద్దాపురం ఎలుకలంటే ఇక మీకు అర్ధం అవ్వాలి అని హేళన చేయడం దానికి బదులుగా వేణు పెద్దాపురం ఎలుకలు కాదు పెద్దాపురం వెళ్లే ఎలుకలు అంటూ మరింత అవమానకరంగా బదులీయడం జరిగింది…”

See Also: ’ఎమ్మెల్యే‘ ఫంక్షన్ కు జూ.ఎన్టీఆర్

“ఇలా షో లో 2:30 నిముషాలు వారి షో యొక్క రేటింగ్స్ పెంచుకోవడం కోసం కావాలని పెద్దాపురాన్ని ఉద్దేశ్య పూర్వకంగా అపహాస్యం చేయడమే కాకుండా ప్రపంచస్థాయి ప్రతిభ కనబరిచి భారతదేశ ప్రతిష్ట పెంచిన కళాకారుడు డా. తాళాబత్తుల సాయి గారిని ఎగతాళి చేయడం వాడు వీడు అంటూ మాట్లాడడం పెద్దాపురం వాసులకే కాకుండా కళాభిమానులందరికీ అవమానకరం. ఇలాంటి కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసిన టీవీ ఛానెల్ మానేజ్ మెంట్ తో పాటు నవదీప్, వేణు, ధనరాజ్, ప్రభాకర్, హరితేజ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యూట్యూబ్ నుండి ఆ వీడియో ను తొలగించవలసినదిగా కోరి ప్రార్ధిస్తున్నాము” అంటూ కంప్లైంట్ నమోదు చేశారు పెద్దాపురం వాసులు.