సొంత స్నేహితులనే జనసేన ఆఫీస్ గేటు దగ్గర ఆపేసిన పవన్ కళ్యాణ్..!

12

ఎన్నికల్లో తొలిసారి తలపడాలనుకుంటున్న పవర్‌స్టార్‌ పార్టీతో… తోడుకోసం చూస్తున్న ఎర్రజెండాలు చేయి కలిపాయి. జనసేనాని మాస్‌ ఇమేజ్‌కి..క్షేత్రస్థాయిలో తమకున్న బలగం కూడా తోడైతే దుమ్ము రేపొచ్చనేది ఏపీలో ఈ కొత్త కాంబినేషన్‌ అంచనా. మొన్నామధ్య పాదయాత్రలో సీపీఎం నేత బనీన్‌ మీద నడుస్తుంటే.. చెమటతో తడిసిన ఆయన చొక్కాని జనసేనాని తన చేతులమీద వేసుకోవడం… మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తోడుండటం చూసి వాహ్‌..క్యా సీన్‌ హై అనుకున్నారంతా…

టీడీపీమీద నిప్పులు చెరిగాక…బీజేపీకి దూరం జరిగాక వామపక్షపార్టీల్ని చెరోవైపు కూర్చోబెట్టుకున్నారు జనసేన అధినేత. కలిసికట్టుగా ప్రత్యేకహోదా ఉద్యమం చేపట్టటమే కాదు…వచ్చే ఎన్నికల్లోనూ ఈ బంధం కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. అన్ని పార్టీలతో అంటకాగిన గతానుభవాలతో వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి కదలాలనే విషయంలో తర్జనభర్జనపడుతున్న సీపీఐ, సీపీఎంలకు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు జనసేనాని తారసపడ్డారు. ఇంకేం..కాంబినేషన్‌ కలిసింది. రెండుమూడు మీటింగులు అయ్యాయి. అనంతపురంతో మొదలుపెట్టాలనుకుంటున్న ప్రత్యేకహోదా ఉద్యమంతో తమ బంధం మరింత బలపడుతుందనే నమ్మకంతో ఉంది జనసేన-వామపక్షాల కొత్త కూటమి.

తన వెనుక బీజేపీ ఉందని టీడీపీ విమర్శలు చేసే అవకాశం లేకుండా, ఒకవేళ చేసినా వాటిని తిప్పికొట్టేలా వామపక్షాలతో దోస్తీకట్టారు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌. అంతా బానే ఉంది కానీ…రోడ్డెక్కితేగానీ తెల్లారని వామపక్షాలు, ఎప్పుడోగానీ రోడ్డుమీదికి రాని జనసేనాని కాంబినేషన్‌ ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేదే రాజకీయవర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ. నాయకుడి అవతారమెత్తిన కథానాయకుడు ఓ సిన్మాలో.. నేతలు జనానికి, మీడియాకి అందుబాటులో ఉండాలని క్లాస్‌ పీకి క్లాప్స్‌ కొట్టించుకుంటాడు. అయితే రియల్ పాలిటిక్స్‌లో మాత్రం ఎవరినీ కలవడానికి అంత ఆసక్తి చూపడం లేదనీ…చొక్కా మడత నలగని రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.

తనకు జనం తప్ప వేరే ఎజెండా లేదని జనసేనాని మైకు మోత మోగిస్తున్నా… ఆచరణలో మాత్రం ఆయన పార్టీలో ఆ వేగం కనిపించడంలేదన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీచేయాలనుకుంటున్న పవన్‌కళ్యాణ్‌…ఇప్పటిదాకా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కసరత్తు మొదలుపెట్టినట్లు కనిపించడంలేదు. పవన్‌ ఆలోచన ఎలా ఉన్నా…ఆయన చుట్టూ ఉన్న కొందరు డైవర్ట్‌ చేస్తున్నారని ఆయన అభిమానుల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ జెండాని భుజాలపై మోసే కార్యకర్తలు‌, జిల్లాల నుంచి జనసేన నేతలు ఉత్సాహంగా వచ్చినా…కేంద్ర కార్యాలయంలో సిబ్బంది తీరుతో మనస్తాపం చెంది వెళ్లిపోతున్నారని సమాచారం. అప్పుడే జనసేనానిని కమ్మేసిన కోటరీతో అనేకమందికి ఇబ్బంది పడుతున్నారని కీలక నేతలే చెప్పుకుంటున్నారు.

ఎవరో అభిమానులకో, జిల్లాలనుంచి వచ్చే నాయకులకో కాదు..సాక్షాత్తూ జనసేన అధ్యక్షుడికి చెరోవైపు ఆసీనులైన ముఖ్యనేతలకే పార్టీ కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మూడు పార్టీలు తలపెట్టిన ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి జనసేన కార్యాలయానికి వచ్చారు సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ. రాష్ట్రస్థాయిలో అందరికీ చిరపరిచితులైన ఈ వామపక్షపార్టీల నేతల్ని పరిచయం అవసరంలేకుండా అంతా గుర్తుపడతారు. కానీ ఎంత తలపండిన నేతలైనా..తమకు అంతా సమానమే అనుకున్నారో ఏమో మధు, రామకృష్ణలిద్దరి కాసేపు గేటుదగ్గరే ఆపేశారు జనసేన కార్యాలయ సిబ్బంది.

పిలిస్తేనే వచ్చామనీ…మీటింగ్‌ ఉందనీ సీపీఎం నేత సర్దిచెబితేగానీ గేటు తెరుచుకోలేదు. అదికూడా లోపల ఉన్న జనసేనాని అనుంగు అనుచరులు అనుమతి ఇచ్చాకే. ఇక లెఫ్ట్ నేతలు ఎక్కడున్నా వాళ్లు మీడియా అటెన్షన్‌ కోరుకుంటారన్నది ఓపెన్‌సీక్రెట్. వాళ్ల దగ్గర దాచడానికేమీ ఉండదు. అంతా బహిరంగమే. అయితే జనసేన కార్యాలయంలోకి మీడియాని అనుమతించకుండా కేవలం ఇండోర్‌ షూటింగ్‌తోనే సరిపెట్టేశారు. మీడియా ప్రతినిధులు ఎవరూ లేకుండానే కేవలం పార్టీ కెమెరా ముందు తమ అభిప్రాయాలు చెప్పుకోవాల్సి రావడంతో కామ్రేడ్లకు కూడా ఈ అనుభవం కొత్తగానే అనిపించిందంటున్నారు.

జనసేన అధ్యక్షుడి వ్యూహమేంటో, ఆయన ఎవరితో కలిసి ముందుకు సాగుతున్నారో తెలీకుండానే కేంద్ర కార్యాలయ వ్యవహారాలు ఉంటాయా అన్నది కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి తెలిసి జరుగుతున్నాయా…ఆయన నోటీస్‌లో లేకుండా జరిగిపోతున్నాయా అనేది సమాధానాల్లేని ప్రశ్నలని జనసేనలోని ఓ వర్గం నేతలు వాపోతున్నారు. పార్టీ పేరులోనే జనం ఉన్నాక..వారికి దూరంగా ఏం చేసినా నేలవిడిచి సాముచేసినట్లేనంటున్నారు. జనంలో ఉండటమే జనసేన లక్ష్యమని నేతలు చెబు తున్నా…నిత్యం జనాల్లో ఉండే వామపక్ష నేతలు… ప్రజలకు అందుబాటులో ఉండే కార్యకర్తలు, నేతలపై పార్టీలోని కొందరు వ్యవహరించే తీరుతో సమస్యలు కొనితెచ్చుకోవాల్సి వస్తుందని జనసేన నేతలే మాట్లాడుకుంటున్నారు. మరి జనసేనాని ఈ బాలారిష్టాలనుంచి ఎలా బయటపడతారో చూడాలి..!