కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌.. కాకా ఫ్యామిలీలో దీపావళి

460
KCR bumper offer .. Dakawali in the Kakka family
KCR bumper offer .. Dakawali in the Kakka family

కాకా.. జి.వెంకటస్వామి. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన చనిపోయినా, కాకా కుటుంబం కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగింది. మాజీ మంత్రి కె.వినోద్‌, మాజీ ఎంపీ కె.వివేక్‌.. కాకా ఫ్యామిలీ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. తెలంగాణలోని ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలలో కె.వివేక్‌ ఒకరు. ఇటీవల ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల జాబితాలో వినోద్‌కి చోటు దక్కలేదు. చెన్నూరు టికెట్ ఆశించారు. ఊహించని విధంగా సిట్టింగ్‌కే టికెట్‌ కేటాయించారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఈ పరిణామంతో అలకబూనిన వినోద్‌.. కారు దిగి హస్తం చెంతకు చేరువవ్వాలనే ప్రయత్నంలో మునిగిపోయారు. త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని భావించారు. వినోద్‌ సోదరుడు వివేక్‌ ఎంతగా నచ్చచెప్పినా, కాకా కుటుంబంలోని ఇతర నేతలు ఆయనను వారించినా వినోద్‌ మెట్టు దిగలేదు.

నేడో రేపో వినోద్‌ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి టైమ్‌లో వినోద్‌కి స్వయంగా కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని, పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ పదవి కట్టబెడతానని హామీ ఇచ్చారు. ఈ హామీతో వినోద్‌ని బుజ్జగించారు కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ అధినేత స్వయంగా ఫోన్‌ చేసి అభయ హస్తం ఇవ్వడంతో వినోద్‌ వెనక్కి తగ్గారంట. మెత్తబడ్డారంట. ఒకానొక దశలో కేసీఆర్‌పై ఇతర ఎస్‌సీ సామాజిక వర్గం నేతలు సైతం వినోద్‌కి టికెట్‌ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ప్రకటించిన లిస్టును సవరించడం మంచిది కాదని, వినోద్‌కి న్యాయం చేసే బాధ్యత తనది అని కేసీఆర్‌ భరోసా ఇవ్వడంతో వినోద్‌ చల్లబడ్డట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక దశలో సోదరుడు అలకబూనడంతో తనకు ఇస్తానని హామీ ఇచ్చిన ఎంపీ టికెట్‌ని తన సోదరుడికి ఇచ్చేలా ఒప్పించాలని కేసీఆర్‌ దగ్గరకు వెళ్లారట వివేక్‌. అయితే, వినోద్‌ పూచీ తనది అని వివేక్‌కి వివరించిన కేసీఆర్‌.. చివరికి దీపావళి రోజు వినోద్‌కి ఫోన్‌ చేసి ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. మొత్తమ్మీద, కాకా ఫ్యామిలీలో నిజమైన దీపావళి వాతావరణం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.