ఆపరేషన్‌ పాలమూరు.. కేసీఆర్‌ బిగ్‌ స్కెచ్‌

66
Operation Aakarsh Part 3 .. KCR Naya Plan
Operation Aakarsh Part 3 .. KCR Naya Plan

ఆపరేషన్‌ పాలమూరు.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి ఇక్కడ చెప్పుకోదగ్గ స్థానాలు దక్కాయి. అదే ఊపును ఈ సారి మరింత పెంచాలనుకుంటున్నారు. జిల్లాకు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు గులాబీ నేతల ఇమేజ్‌ని పెంచాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయింది. డిండి ప్రాజెక్ట్‌ త్వరలోనే అమల్లోకి రానుంది. మిషన్‌ భగీరథలో ముందుగా తాగునీరు అందబోతున్న జిల్లాలలో పాలమూరు ఒకటి. ఉమ్మడి జిల్లాను విభజించిన సమయంలోనూ ప్రజల ఆశలు, అంచనాలకు తగ్గట్లు జోగులాంబ జిల్లాను కూడా ప్రకటించారు కేసీఆర్‌.. దీంతో పాలమూరు ప్రజలలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై గౌరవం పెరిగింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి సీనియర్స్ పోటీ పడుతున్నారు. గద్వాల నుండి డీకే అరుణ, కల్వకుర్తి నుండి వంశీ చందర్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుండి నాగం జనార్ధన్‌ రెడ్డి, కొడంగల్‌ నుండి రేవంత్‌ రెడ్డి, వనపర్తి నుండి చిన్నారెడ్డితోపాటు దేవరకద్ర నుండి టీడీపీ సీనియర్‌ నేత బరిలో ఉన్నారు. వీరిని ఓడించాలంటే పక్కా స్కెచ్‌ అవసరమని భావించిన కేసీఆర్‌, తాజాగా ఆ బాధ్యతలను మంత్రి జూపల్లి కృష్ణారావు, టి.శ్రీనివాస్‌ గౌడ్‌ వంటి నేతలకు అప్పగించారు. వారికి పక్కాగా డైరెక్షన్‌ ఇచ్చి పంపుతున్నారు. మండల స్థాయి కాంగ్రెస్‌ నేతలు, గ్రామ స్థాయి టీడీపీ నేతలతోపాటు బూత్‌ స్థాయిలోని నేతల లిస్టును వారికి పంపి వారిని టీఆర్‌ఎస్‌కు అండగా పనిచేసేలా చూసే బాధ్యతను అప్పగించారు.. ఈ ఇద్దరుతోపాటు కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా హరీష్‌ కో-ఆర్డినేట్‌ చేసుకునేలా చూస్తున్నారు టీఆర్‌ఎస్‌ అధినేత..

ఆపరేషన్‌ పాలమూరుతో త్వరలో జరగబోయే ఎన్నికలలో గులాబీ పార్టీకి జిల్లాలోని మెజారిటీ స్థానాలు దక్కేలా చూడాలని స్కెచ్‌ గీశారు కేసీఆర్‌. రాజకీయ వ్యూహంతోపాటు తన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయపథాన నడిపిస్తాయని ధీమాగా నమ్ముతున్నారు గులాబీ నేతలు. కేసీఆర్‌ స్ట్రాటజీ, ఆయన ఇమేజ్‌ తమను భారీ మెజారిటీతో గెలిచేలా చేస్తుందని భావిస్తున్నారు.. మరి, గులాబీ దళపతి ఆపరేషన్‌ పాలమూరు ఎలా వర్కవుట్‌ అవుతుందో చూడాలి.