మేము విడుదల చేసుకోవడానికే థియేటర్లు లేవు!

0

సంక్రాంతి పండుగ సెలవులను దృష్టిలోపెట్టుకుని 6 నెలల ముందు నుండే తమ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తామని తెలుగు సినిమా అగ్రనిర్మాత దిల్ రాజు తెలిపారు. తెలుగు సినిమాలన్నీ దాదాపుగా పండుగ సందర్భాల్లోనే విడుదల చేయడానికి నిర్మాతలు వేచి చూస్తారని, దీనిపై డబ్బింగ్ సినిమాలను విడుదల చేసే నిర్మాతలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. వెంట వెంట సినిమాల విడుదల దృష్ట్యా థియేటర్లు సర్దుబాటు చేసుకొని, అందరికి అనువుగా ఉండేట్లు సినిమాలు విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు.

ఈ సంవత్సరం సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదల కానుండడంతో తెలుగు సినిమాలకే థియేటర్లు లభించక తలలు పట్టుకుంటున్నామని అయన అన్నారు. ఆరు నెలల ముందునుండే మా సినిమాల విడుదల తేదిని ప్రకటించగా, కేవలం 15 రోజుల ముందు డబ్బింగ్ సినిమాను తీసుకువచ్చి థియేటర్లు లేవని గొడవ చేయడం హాస్యాస్పదమని దిల్ రాజు అన్నారు. అయినా డబ్బింగ్ సినిమాలకు మేము వ్యతిరేకం కాదని, గత నాలుగు నెలల్లో ఒకే నిర్మాత మూడు డబ్బింగ్ సినిమాలు విడుదల చేసినట్టు దిల్ రాజు వ్యాఖ్యానించారు.