గంటాకు చెక్ పెట్టిన మంత్రి అయ్యన్నపాత్రుడు

7

విశాఖ పట్నం జిల్లాలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. మొదట్నుంచి గంటాతో విభేదిస్తూ వస్తున్నరు అయ్యన్న. మొన్న విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణం ను మంత్రి అయ్యన్న పాత్రుడే తెరవెనుక ఉండి బయటపెట్టారు. కుంభ కోణం వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారని నిరూపించి, మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించేలా పావులు కదిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, సామాజిక కారణాల వల్ల మంత్రి గంటాపై చర్యలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు వెనకడుగు వేశారు.

తాజాగా జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) కమిటీ నియామకంలో తన సిఫారసును పక్కన పెట్టడంతో అయ్యన్న రగిలిపోయారు. హోం మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎదుట పంచాయతీ పెట్టారు. ఈ మేరకు.. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

2013లో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సీపట్నానికి చెందిన.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాఘవేంద్ర రావు చైర్మన్ గా 15మంది సభ్యులను నియమిస్తూ.. డీఎల్ డీఏ కమిటీని నియమించింది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలోని అన్ని జిల్లాల్లో డీఎల్ డీఏ కమిటీలన్నింటినీ రద్దు చేసింది. దీంతో చైర్మన్లు, సభ్యలంతా రాజీనామాలు చేయాలి.. కానీ, విశాఖపట్నంలో మాత్రం అలా జరగలేదు.

రాఘవేంద్రరావు చైర్మన్ గా డీఎల్‌డీఏ ఐదేళ్ల పదవీ కాలం గత నెల 5వ తేదీతో పూర్తిచేసుకుంది. అలాగే  పదేళ్లుగా రాఘవేంద్రరావే.. చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జిల్లా కొత్తకమిటీని నియమించాల్సి ఉంది. అయితే పదేళ్లుగా కొనసాగుతున్న కమిటీనే కొనసాగించాలని మంత్రి అయ్యన్న పాత్రుడు గత నెల 19న కలెక్టర్ కు లేఖ రాశారు.

కానీ, పశుసంవర్థక శాఖ అధికారులు మాత్రం కొత్త కమిటీని ఎన్నుకునేందుకు 21న కలెక్టర్ కు లేఖ రాశారు. కాని వారికి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పవు సంవర్థక శాఖ  ఎగ్జిక్యూటివ్ అధికారి 27న డీఎల్ డీఏ కమిటీని 16మందితో నియమించారు. చైర్మన్ గా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గానికి చెందిన గాడు వెంకటప్పడును నియమించారు.

తాను సూచించిన కమిటీని కాదని వేరే కమిటీని నియమించడంతో మంత్రి అయ్యన్న పాత్రుడు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జిల్లాలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆగ్రహించారు. మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎదుట పంచాయతీ పెట్టారు. సాయంత్రంలోగా కమిటీలో మార్పులు చేయకపోతే పదవి వదులుకుంటానని హెచ్చరించారు. దీంతో అప్పటికప్పుడే కలెక్టర్‌తో చినరాజప్ప ఫోన్‌లో మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు కూడా ఫోన్‌లో కలెక్టర్ పై మండిపడ్డారు. మంత్రులంటే తమాషాగా ఉంది అంటూ నిప్పులు చెరిగారు. తనకు తెలియకుండా నియామకం జరిగిందని కలెక్టర్‌ వివరణ ఇచ్చుకున్నారు. సాయంత్రం ఈ కమిటీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.

కమిటీ రద్ధుతో మంత్రి గంటీ శ్రీనివాసరావు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి అయ్యన్న ప్రతీ విషయంలో తల దూర్చుతున్నారంటూ మండిపడుతున్నారు.