కేసీఆర్ ఒక్క‌రితో కాదు.. 1,500 మందితో తెలంగాణ వ‌చ్చింది.

3

సీఎం కేసీఆర్ చేసిన హిందూ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్, ఇక్కడున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పెద్ద పెద్ద నోళ్లు పెట్టుకుని మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ సమస్య లేనట్లు బీజేపీ నేత‌లు హిందు.. హిందువని మాట్లాడుతున్నార‌ని , .. నువ్వేనా హిందువు.. మేము కాదా.. మేము తిరుపతి పోమా.. ఏడుపాయల పోమా.. కాళేశ్వరం పోమా.. గుండుకొట్టించుకోమా.. మేం మొక్కమా మోక్కులు.. మీకన్న నిఖార్సైన హిందువులం మేమే అంటూ చుర‌క‌లంటించారు.

మేం చేసినన్ని యాగాలు ఇండియాలే ఎవరు చేయ‌లేద‌ని సూచించారు. త‌న‌పై మోదీ చేసిన వ్యాఖ్య‌ల్ని తూర్పార‌బ‌ట్టిన కేసీఆర్..మోదీ మాట్లాడుతూ కేసీఆర్ పాలనకన్నా పూజలెక్కువ చేశారంటున్నార‌ని, అందుకే మోదీ వస్తే తాను ప్రసాదం పెట్టి పంపిస్తామ‌ని కేసీఆర్ తెలిపారు. మీరు చెప్ప‌క‌పోతే లగ్గాలు కావా.. తద్దినాలు జరుగవా.. మేమూ హిందువులమే.. మీకన్నా మాకే ఎక్కువ సంప్రదాయం తెలుసంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు మించిన హిందుత్వవాది ప్రపంచంలోనే లేరని అనుకోవడం పొరపాటని అన్నారు.

ఇంట్లో ఫొటోలు పెట్టుకోవడం, యాగాలు చేయడం హిందుత్వం కాదని ఆయన చెప్పారు. హిందుత్వవాది అని చెప్పుకున్న కేసీఆర్‌ పక్కన ఎవరు ఉంటారో.. ఆయన మిత్ర పక్షం ఎవరో గమనించాలని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్లు అంటూ కేసీఆర్‌ ఒకే ధోరణిలో ఉన్నారని విమర్శించారు. ‘‘ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చిందని కేటీఆర్‌ అంటున్నారు. ఈ అంశంపై తాను కేసీఆర్ తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని స‌వాల్ విసిరారు. తెలంగాణ 1,500 మంది బలిదానంతో వచ్చింది. కేసీఆర్‌ ఒక్కరితో రాలేదు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఎప్పుడైనా ఐదు నిమిషాలు మాట్లాడారా? అని కిషన్‌రెడ్డి అన్నారు.