సర్వేల్లో దూసుకుపోతున్న వైసీపీ – టీఆర్ఎస్

0

ఎన్నికల ముంగిట దేశవ్యాప్తంగా సర్వేల కోలాహలం నడుస్తోంది. తాజాగా టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే సంయుక్తంగా అభిప్రాయ సేకరణ చేశాయి. మార్చిలో నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మొత్తం 16,931 మంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ 22 ఎంపీ సీట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వస్తాయని అభిప్రాయసేకరణలో వెల్లడైనట్టు తెలిపింది. ఓట్ షేర్ పరంగా చూస్తే, వైసీపీకి 48.8 శాతం, టీడీపీకి 38.40 శాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది. బీజేపీకి 5.80 శాతం, కాంగ్రెస్‌కు 2.20 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ కారు టాప్ గేర్‌లో దూసుకెళుతుందని టైమ్స్ నౌ సర్వేలో వచ్చింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో 13 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకోవచ్చని సర్వేలో వచ్చింది. బీజేపీ 2, కాంగ్రెస్ 1, ఇతరులు ఒక సీటు సాధించవచ్చని అంచనా వేసింది. ఓట్ షేర్ పరంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీకి 41.20 శాతం, కాంగ్రెస్‌కు 30.30 శాతం, బీజేపీకి 17.60శాతం, ఇతరులకు 10.90 శాతం ఓట్లు రావొచ్చిన టైమ్స్ నౌ – వీఎంఆర్ అభిప్రాయ సేకరణలో వెల్లడైంది.