ఎల్లో మీడియాకు సవాల్.. పవన్ చేతికి మరో టీవీ ఛానల్…!

0

  కత్తి మహేష్, శ్రీరెడ్డి ఉదంతాల అనంతరం మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించారు పవన్ కల్యాణ్. అసలు తనకు సరితూకం కాని  వ్యక్తులను ఎల్లోమీడియా డిబేట్లకు తీసుకొచ్చి అదే పనిగా తిట్టిస్తుంటే.. మౌనం వహించారు. సహించారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బయటకొచ్చేసిన తర్వాత పవన్ పై మీడియా దాడి అధికమైంది. ఆయన కార్యక్రమాలకు అసలు ప్రచారం పూర్తిగా కరువైంది. ముఖ్యంగా శ్రీరెడ్డి చేత పవన్ తల్లిని తిట్టించడం, దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉండటం.. దీనికి కొన్ని ఛానళ్లు పనిగట్టుకోవడంతో.. ఆయన అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. సోషల్ మీడియా వేదికగా బలంగా ఉన్న జనసేనాని.. మీడియా, పత్రిక పరంగా బలంపుంజుకోవాలని అభిమానులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. మన వాయిస్ విన్పించేందుకు ఒక ఛానల్ పెట్టాలని పవన్ ను చాలామంది కోరారు. ఒక్క పిలుపు ఇస్తే.. తామే చందాలు వేసుకుని మరైన ఛానల్ పెడతామని కోరారు.

దీంతో పవన్ ఆలోచనలో పడ్డారు. తనపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలి అంటే.. మీడియా సపోర్ట్ తప్పనిసరి అని గుర్తించారు. ఈ నేపథ్యంలో సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99టీవీని మాజీ ఐఏఎస్ అధికారి, జనసేన నేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఛానల్ జనసేన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ గొంతను బలంగా విన్పిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ముత్తా గోపాల కృష్ణ జనసేన పార్టీలో చేరారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ దిన పత్రిక ఆంధ్రప్రభ సపోర్ట్ కూడా పరోక్షంగా పవన్ కు లభించినట్లైంది. అలాగే…ముత్తా గోపాలకృష్ణ తనయుడు…ముత్తా గౌతమ్ ఇండియా ఏ హెడ్ అనే ఇంగ్లీష్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ లో ఓ కార్యక్రమానికి హోస్టింగ్ చేయాల్సిందిగా పవన్  ను కోరారు గౌతమ్. అందుకు ఆయన కూడా అంగీకారం తెలిపారు. దీంతో ఒక నేషనల్  ఛానల్ సపోర్ట్ కూడా పవన్ కు దక్కినట్లైంది.

దీంతో ఒక లోకల్ ఛానల్, దినపత్రిక, నేషనల్ ఛానల్ సపోర్ట్ ప్రస్తుతానికి జనసేన పార్టీకి ఉంది. ఇది కాక మరో ఛానల్ కూడా ఆ పార్టీకి బలం కానుంది. పవన్ కల్యాణ్ సపోర్ట్ తో ఓ ఎన్నారై.. టీవీ ఛానల్ ప్రారంభించినున్నట్లు తాజా సమాచారం. జనసేన వర్గాలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుతానికి టెక్నికల్ సెటప్ అంతా పూర్తయింది. ఇంకా కొన్ని పనలు మిగిలి ఉన్నాయి. ఈ దసరాకు టెస్ట్ సిగ్నల్ జరుగుతుందని సమాచారం. ఈ ఛానల్ కు కూడా 9 అంకె వచ్చే పేరు ఖరారు చేసేందుకు నిర్ణయించారు.