అమరావతిపై ఎటూ తేల్చని సీఎం జగన్ : ఆందోళనలపై డైలమాలో రైతులు

99

అమరావతిలో రాజధాని అంశంపై ఎటూ తేల్చలేదు సీఎం జగన్. వారం రోజులుగా ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు, సంచనాలు అంటూ ఊదరగొట్టాయి ఛానల్స్, పత్రికలు. అనుకున్నట్లుగానే డిసెంబర్ 27వ తేదీన కేబినెట్ భేటీ జరిగింది. రెండు గంటలు పైనా మంత్రులు చర్చించారు. బేటీ ముగిసింది. మంత్రి పేర్నినాని వివరించారు.

అమరావతి అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎటూ తేల్చలేదు మంత్రిగారు కూడా. రైతుల ఆవేదన మాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం ఉద్దేశం అని వివరించారు. ఏపీ రాజధాని ఏంటీ అంటే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. భూములను అభివృద్ధి చేసి ఇస్తామని రైతులకు భరోసా ఇస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామనే అంశంపైనే మాట్లాడలేదు మంత్రి.

ఈ మాటలు చెప్పని మంత్రి.. రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ రావాల్సి ఉంది అని స్పష్టం చేశారు. అదే విధంగా జీఎన్ రావు నివేదికలపై అధ్యయనానికి హైలెవల్ కమిటీ వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక జనవరి నెలలో వస్తుందని వివరించారు. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసే హై లెవల్ కమిటీలో మంత్రులు, న్యాయ నిపుణులు ఉంటారని స్పష్టం చేశారు.

మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేయలేదని.. ఉండొచ్చు అని మాత్రమే అన్నారని.. అంత మాత్రానికే ఇంత ఆందోళన ఎందుకని నిలదీశారు. రాజధాని భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన టీడీపీనే ఈ ఆందోళనలకు ఆజ్యం పోస్తుందని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. అమరావతిపై ఎటూ తేల్చని కేబినెట్ తో రైతుల్లో డైలమా నెలకొంది. ఇంకా ఎన్నాళ్లు ఆందోళనలు కొనసాగించాలనే విషయంపై డైలమాలో ఉన్నారు.