దిశ ఘటనపై ప్రపంచం స్పందించింది.. మన వైన్ షాపులకు, బార్లకు, పబ్స్ కు ఏమైందీ?

41

దిశ ఘటన ప్రపంచం మొత్తం స్పందించింది.. ప్రాంతాలు, భాషలు, దేశాలకు అతీతంగా అందరూ గళమెత్తారు. స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, చివరికి ఐటీ ఉద్యోగులు కూడా ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. ప్రపంచంలోని ప్రతి మనిషి, ప్రతి సంస్థ స్పందించినా.. వాళ్లు మాత్రం స్పందించలేదు. నిరసన వ్యక్తం చేయలేదు. కనీసం సానుభూతి కోసం అయినా ఓ గంట షాపులు మూయలేదు.

వాళ్లు ఎవరో తెలుసా దిశ ఘటన జరిగిన హైదరాబాద్ లోని వైన్ షాపులు, బార్లు, పబ్స్. అవును ఈ యజమానులు బయటకు రాలేదు.. ఆ సిబ్బందికి టైం ఇవ్వలేదు.. వాళ్ల వ్యాపారం వాళ్లు చక్కగా చేసుకున్నారు. మానవత్వం కోసం అయినా కనీసం ఓ గంట షాపులు మూసి తమ జాలి హృదయాలను కూడా చూపించలేదు. దిశ ఘటన వెనక ప్రధాన పాత్ర పోషించింది మద్యం అన్న సంగతి కూడా వాళ్లకు తెలుసు. అయినా సరే.. మాకేం పట్టలేదు.. మా తప్పేం లేదు అన్నట్లు వ్యహరించారు.

ప్రతి ఇంట్లో ఈ విషయం చర్చకు వచ్చింది. అందరూ ప్లకార్డులు, బ్యానర్లు, కొవ్వొత్తులు పట్టుకుని మరీ బయటకు వచ్చారు. వాళ్లు మాత్రం అస్సలు స్పందించలేదు.

రాత్రి 11 గంటలకు వైన్ షాపులు మూసిన తర్వాత అయినా సరే కొవ్వొత్తులు పట్టుకుని బయటకు వచ్చారా అని వేయికళ్లతో ఎదురుచూసిన వాళ్లకు నిరాశే ఎదురైంది. మద్యం వ్యాపారంతో ప్రభుత్వాలు, యజమానులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా.. సమాజంలో జరిగిన ఓ ఘటనపై స్పందించే హృదయం లేకపోవటం ఏంటని మహిళలు అంటున్నారు.

దిశ నెల మాసికం ఇంకా కాలేదు.. ఎన్ కౌంటర్ రక్తపు మరకలు ఆరనే లేదు.. దేశంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి టైంలో జనవరి ఫస్ట్ వేడుకలు చేసుకోవాలా.. ఆ రోజు షాపులకు సెలవు ఇస్తే ఏమౌతుంది.. బార్లు, పబ్స్ మూసివేస్తే కొంపలు అంటుకుపోవుకదా.. చూద్దాం.. ఇప్పటికైనా మార్పు వస్తుందో లేదో..

#బాయ్ కాట్ న్యూఇయర్ సెలబ్రేషన్స్