ప్రధాని మోడీ ఎదుట సీఎం జగన్ పెట్టిన 10 డిమాండ్లు ఇవే..

305

ఢిల్లీలో ప్రధాని మోడీతో ఆయన నివాసంలోనే గంటన్నరపైనే చర్చించారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను విడివిడిగా బ్లూప్రింట్ తీసి మరీ ఇచ్చారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు.

ప్రధాని మోడీకి సీఎం జగన్‌ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు ఇలా ఉన్నాయి.

1. మార్చి 25 ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రావాల్సిందిగా ప్రధానిని కోరారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపిన సీఎం. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పుభూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్రమంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా కోరారు.

2. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55వేల 549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33వేల 010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపిన సీఎం. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3వేల 320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి.

3. అభివృద్ధి పరంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన సీఎం. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో కోరారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని వివరించారు.

4. రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22వేల 948 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని, ఇంకా రూ.18వేల 969 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు.

5. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10వేల 610 కోట్లు మాత్రమే వచ్చాయని,
గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని ముందు ఉంచిన సీఎం. కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని వినతి. కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరిన సీఎం.
రాజధాని నిర్మాణానికి రూ.2వేల 500 కోట్లు కేటాయిస్తే.. వెయ్యి కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరిన సీఎం.

6. ఆరేళ్లలో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు కేవలం రూ.వెయ్యి 50 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని గట్టిగా కోరిన సీఎం. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4వేల ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి వివరించిన సీఎం.

7. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం.
కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.

8. వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడి. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని వెల్లడి. ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపిన సీఎం.

9. శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సీఎం. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందన్న సీఎం. శాసనసభ మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ రికమెండ్‌ చేసిందన్న సీఎం. తదుపరి చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి

10. ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి వివరించిన సీఎం. ఈ చట్టాన్ని ఆమోదించేలా హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి.