ఓవర్ టూ అయోధ్య : రామ మందిరం నిర్మాణంలో సీఎం కేసీఆర్ సూచనలు

195

నాలుగు నెలల్లో అద్భుతంగా రామ మందిరం నిర్మాణం చేపడతామని ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. రామ మందిరం అంటే ఆషామాషీ కాదు. శ్రీరాముడు పుట్టిన ప్రాంతం. హిందూవులకు అత్యంత పుణ్య స్థలం. శ్రీరామచంద్రుడు పుట్టిన చోట ఆలయం అంటే.. అది చరిత్రకు సాక్ష్యం.
ఇంత ప్రాధాన్యత ఉన్న రామ మందిర నిర్మాణంలో హిందూ ధర్మ పీఠాధిపతులు, వాస్తు పండితులు, శిల్ప కళా నైపుణ్యం ఉన్న అందరి అభిప్రాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది ఆలయ నిర్మాణ కమిటీ.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలను తీసుకుంటుంది అంట కమిటీ. దీనికి కారణాలు లేకపోలేదు. యాదాద్రి ఆలయం నిర్మాణం, శిల్ప కళా నైపుణ్యం, వాస్తు లాంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. రాజుల కాలం నాటి ఆకారంలో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. రాజుల కాలం నాటి నిర్మాణ శైలికి తీసిపోని విధంగా.. ఆధునిక హంగులతో అద్భుతంగా యాదాద్రిని నిర్మించారు. ఆలయం నిర్మాణంలో ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించి, పండితుల సూచనలు, సలహాలు స్వీకరించి మరీ నిర్మాణం చేశారు. యాదాద్రి ఆలయం ప్రారంభానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు, స్వామీజీలు, వేద పండితులు, హోమాలు, యజ్ణాలు నిర్వహించటానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కాలంలో ఇలాంటి శిల్పకళా నైపుణ్యంతో ఓ ఆలయ నిర్మాణం చేయటం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ రామ మందిరం అంటే భారతదేశానికే అద్భుత ఘట్టం. ఈ క్రమంలోనే రామ మందిర నిర్మాణం కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు కోరారని సమాచారం. నిర్మాణ శైలి, శిల్ప కళా ఆకృతులు, వాస్తు, ప్రాకారాలు, గర్భగుడి, ఆలయం లోపల చేపట్టే ఇతర నిర్మాణాలకు సంబంధించిన అనేక విషయాలను ఈ కమిటీ సీఎం కేసీఆర్ తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
వీలైతే అతి త్వరలోనే అయోధ్య వెళ్లి కమిటీతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ మందిరం నిర్మాణంలో సీఎం కేసీఆర్ భాగస్వామ్యం కూడా ఉండబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.