పవన్ రాకతో బీజేపీలో లుకలుకలు : పురంధేశ్వరి అసంతృప్తి

1023

పవన్ కల్యాణ్ రాకతో బీజేపీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. జనసేన పార్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నట్లు సమాచారం. టీడీపీని కాదని ఒంటరిగా బరిలోకి దిగాం.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వారితో నింపేశాం. బీజేపీ అంటేనే విషం కక్కిన జనసేన పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నాం. పార్టీ సిద్ధాంతాలు ఏంటీ.. ఎటువైపు వెళుతున్నాం అని కొందరు సీనియర్లు అసమ్మతి రాగం అందుకున్నారంట.

జనసేన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక విధానంతో వెళ్లలేదు. 2014 ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి వచ్చింది కేవలం 11 లక్షల ఓట్లు మాత్రమే. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఇంత వరకు పార్టీ నిర్మాణమే చేపట్టలేదు. సంస్థాగతంలో ఆఫీసులు, క్యాడర్ లేదు. రాజకీయ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణమే లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన్ను తీసుకొచ్చి బీజేపీలో క్రౌడ్ పుల్లర్ గా మార్చటం ఏంటని నిలదీస్తున్నారు. దీని వల్ల ఏపీలో పార్టీ నిర్మాణమే గతి తప్పుతుందని ఆసహనం వ్యక్తం చేస్తున్నారంట.

పవన్ కల్యాణ్ తో పొత్తు వల్ల బీజేపీ సిద్దాంతాలే గాడితప్పే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఇప్పటి వరకు బీజేపీ అంటే ఉన్న అభిప్రాయం ఇలాంటి సినిమా హీరో వల్ల పూర్తిగా దెబ్బతింటుుందని చెబుతున్నారంట. పవన్ కల్యాణ్ ను ఇప్పుడు తీసుకుని ఏం చేస్తారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా పురంధేశ్వరి వంటి సీనియర్ నాయకురాలు అయితే.. పవన్ రాకతో ఒరిగేది లేకపోతే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ మీటింగ్ లోనూ ఆమె ముభావంగా ఉన్నరనే వార్తలు వస్తున్నాయి.