ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ ను అరెస్ట్ చేయొద్దు

191

గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కారులో సహా కింద పడి.. యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. సైబరాబాద్, మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు హైకోర్టు జడ్జి టి.వినోద్ కుమార్.

యాక్సిడెంట్ లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కృష్ణమీలన్ ఆదివారం రోజు ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులు. ఈ విషయం తెలిసిన మిలన్ తరపు లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలోని లోపాల వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు చెబుతున్నారు లాయర్. యాక్సిడెంట్ సమయంలో డ్రైవర్ 40-50 కిలోమీటర్ల వేగంతోనే వెళుతున్నాడని.. అయితే ఫ్లైఓవర్ మధ్యలో ఎస్(S) ఆకారంలో నిర్మాణం ఉండటం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మొదట యాక్సిడెంట్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఒత్తిడుల కారణంగా సెక్షన్స్ మార్చారని పిటీషనర్ తరపు లాయర్ వాదిస్తున్నారు.

గతంలో అదే స్థలంలో యాక్సిడెంట్ జరిగి ఇద్దరు చనిపోయారని.. ఆ కేసులో వెంటనే బెయిల్ మంజూరు అయ్యిందన్నారు. కృష్ణ మిలన్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. అరెస్ట్ చేయటానికి ఆస్పత్రికి వచ్చారని చెబుతున్నారు లాయర్. డాక్టర్లు 6 వారాల విశ్రాంతి కావాలని చెప్పటంతో వెనుదిరిగారని వెల్లడించారాయన. వాదనలు విన్న హైకోర్టు డిసెంబర్ 12వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.