ఒక్కో గుడ్డు 10 రూపాయలు.. త్వరలో మీరు గుడ్లు తేలేయటం ఖాయం..

197

ధరల మంట వంటింటిని అల్లకల్లోలం చేస్తోంది. హైదరాబాద్ లో కిలో ఉల్లి 200 రూపాయలకు చేరింది. ఇప్పుడు మరో నిత్యావసర సరుకు కూడా అదే బాటలో పయనించబోతున్నది. అదే గుడ్డు. ప్రస్తుతం మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర 6 రూపాయలుగా ఉంది. త్వరలో ఇది 10 రూపాయలకు చేరబోతున్నది. ఈ విషయాన్ని ఫౌల్ట్రీ వ్యాపారులు తేల్చిచెబుతున్నారు.

ఉల్లి ధర తగ్గొచ్చు ఏమోగానీ.. రాబోయే రోజుల్లో గుడ్డు ధర మాత్రం 10 రూపాయలకు చేరవచ్చని గట్టిగా చెబుతున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు. కోడిగుడ్ల కోసం కోడికి ప్రధానంగా వేసే ఆధారం మొక్కజొన్న. మొన్నటి అకాల వర్షాలకు మొక్కజొన్న పంట తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మొక్కజొన్న పంటను దిగుమతి చేసుకుంటున్నారు. దీని వల్ల ఒక్కో గుడ్డుకు అదనంగా రెండు రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం 6 రూపాయలు చేరుకున్న గుడ్డు ధర.. మరికొన్ని రోజుల్లోనే 8 రూపాయలు కావటం ఖాయం. గుడ్డు 8 రూపాయలకు చేరినా అది ఖర్చు – అమ్మకానికి సరిపోతుంది. లాభం రావాలంటే.. ఫౌల్ట్రీ పరిశ్రమ బతకాలి అంటే మాత్రం లాభాలు ఉండాల్సిందే అంటున్నారు రైతులు.

మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఖర్చులు కూడా కలుపుకుంటే ఒక్కో గుడ్డును 10 రూపాయలకు అమ్మాల్సి ఉంటుందని తేల్చిచెబుతున్నారు రైతులు.

అంటే ఉల్లి బాటలోనే కోడిగుడ్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి. బీ కేర్ ఫుల్ పబ్లిక్..