రైతుకు రైతే శత్రువు అయ్యాడు.. అమరావతి తెచ్చిన కొత్త చర్చ

267

రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ 29 గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి మిగతా ప్రాంతాల్లో రైతులు మద్దతు ఇవ్వటం లేదు. ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు అని చెప్పుకునే వారు కూడా ఆ మాటెత్తటం లేదు. ఫేడ్ ఔట్ అయిన మేధావులు మాత్రం అరుస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే.. ఏపీ రైతులకు రైతే శత్రువు అయ్యాడు. అమరావతి రైతు ఉద్యమం కొత్త సమీకరణాలు, ఆలోచనలు, ప్రాంతం, కులం ఇలా అనేక అంశాలను తెరపైకి తెచ్చి.. మరోసారి చర్చకు దారి తీసింది.

అమరావతిలోని 29 గ్రామాల రైతులు రాజధాని కోసం భూముల త్యాగం చేశాం అన్నారు. దీన్ని సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కోసం భూములే కాదు ఊర్లు, ఇళ్లతోపాటు సర్వం త్యాగం చేసిన మమ్మల్ని ఏమనాలి అంటూ వాదన తీసుకొచ్చారు. 40 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ రైతుల్లోని కొందరికి నష్టపరిహారం అందలేదు అన్నది సత్యం. వారి కోసం ఎప్పుడైనా మిగతా ప్రాంత రైతులు మద్దతు ఇచ్చారా.. ఆందోళన చేశారా.. పోరాడారా.. లేదు కదా.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు వారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతో విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, డ్యాంలు, రిజర్వాయర్లు ఇలా ఎన్నింటికో రైతులు తమ భూములను త్యాగం చేశారు. అది కూడా వన్ టైం సెటిల్ మెంట్. ప్రభుత్వ విలువ ప్రకారం వేలు, లక్షలు మాత్రమే ఇచ్చి లాగేసుకున్నారు. వారిది త్యాగం కాదా.. సర్వం కోల్పోయిన వారి జీవితాల గురించి అప్పుడు-ఇప్పుడు ఎవరైనా మాట్లాడారా అంటే అదీ లేదు.

ఇదే ఇప్పుడు అమరావతి రైతులకు శాపం అయ్యింది. అమరావతిలో భూమి కొనాలి అంటే కోట్లు కావాలి.. రైతులు ఇచ్చిన భూములకు ఐదేళ్లు కౌలు తీసుకున్నారు.. లక్షల్లో రుణమాఫీ చేయించుకున్నారు.. అంతేకాదు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి 35 శాతం తిరిగి తీసుకుంటున్నారు.. ఇదంతా తెలిసిన మిగతా ప్రాంత రైతులు దాన్ని త్యాగంగా అస్సలు గుర్తించకపోవటమే అసలు సమస్య.

ఇక రాజధాని అంశం అనేదే మిగతా ప్రాంతాలకు పట్టటం లేదు. అది మాకు సంబంధించినది కాదు అన్న అభిప్రాయానికి ఎప్పుడో వచ్చారు. దీనికి కారణం అప్పట్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఆ ప్రాంతం పేరుతో చేసిన హడావిడి. కొందరికి మాత్రమే అది రాజధాని, టీడీపీ వర్గానికే పెద్దపీట అనే భావన ఏపీలోని ప్రతి వ్యక్తిలో నాటుకుపోయింది.

అందుకే ఇప్పుడు రాజధానిలోని 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తుంటే మిగతా ప్రాంతాల వారు అస్సలు పట్టించుకోవటం లేదు. సాటి రైతు అనే భావన, ఆలోచన కూడా చేయటం పోవటం విడ్డూరం. తెలంగాణకు చెందిన కొందరు పెయిడ్ మేధావులు మాట్లాడుతున్నా.. మిగతా వారిలో స్పందన రాకపోవటం ప్రజల ఎంత క్లారిటీగా ఉన్నారో చెబుతున్నారు. 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా.. అది ఆ ప్రాంతానికే పరిమితం కావటం కూడా ఆలోచించదగ్గ విషయం.