ఆ రూ. 3 కోట్లు నాకు వద్దు.. తన ఫైల్ ను తానే తిప్పి పంపించిన సీఎం జగన్

151

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఫైల్ ను తానే తిప్పి పంపించుకున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న 3 కోట్ల రూపాయలు వద్దని స్పష్టం చేశారు. అసలు మేటర్ ఏంటో తెలుసుకుందాం..
బెజవాడ తాడేపల్లిలో సీఎం జగన్ ఇల్లు ఉంది. ఇదే క్యాంప్ ఆఫీస్ కూడా. సీఎం మంచీచెడ్డాకు అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం అయిన మొదటి నెలలోనే అత్యవసరంగా కొన్ని మార్పులు – చేర్పులు – ఏర్పాట్లు చేశారు. అప్పట్లోనే 2 కోట్లతో హెలిప్యాడ్, 5 కోట్లతో రోడ్లు విస్తరణ చేపట్టారు. 4 కోట్లతో ఎలక్ట్రికల్ వర్క్ జరిగింది. అప్పట్లోనే విమర్శలు వచ్చినా.. ఇదంతా సీఎం భద్రత అని సరిపెట్టుకున్నారు.

ఇప్పుడు సీఎం జగన్ ఉండే ఇంట్లో మరమ్మత్తులు, ఇతర ఖర్చుల కింద రోడ్లు, భవనాల శాఖ 2.87 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఇంట్లోని కిటికీలు, తలుపులు మార్పు చేయనున్నారు. అదే విధంగా సిబ్బంది సౌకర్యార్థం కొన్ని వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికితోడు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఇంటి నిర్వహణకు 25 లక్షలు కూడా కేటాయించారు. ఇవి కాకుండా తాడేపల్లి ఇంట్లో ఫర్నిచర్ మార్పు, ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించిన పనులకు జీవోలు జారీ చేశారు.

ఫైనల్ గా ఈ మొత్తం విడుదల కావాలంటే సీఎం జగన్ ఆదేశాలు ఉండాలి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే సొంత ఇంటి కోసం కోట్లకు కోట్లు తగలేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్.. తన ఫైల్ ను తానే తిప్పి పంపారు. ఇప్పుడు 3 కోట్ల రూపాయలతో ఇంట్లో మెరుపులు అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు.