ఆర్టీసీ కార్మికులకు హ్యాపీ న్యూస్ : ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

141

తెలంగాణ ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం కేసీఆర్. కేబినెట్ తర్వాత ప్రభుత్వ వైఖరిని వెల్లడించారాయన. అనాలోచిత నిర్ణయం వల్లే సమ్మెకు వెళ్లారన్నారు. దీనికి పూర్తి బాధ్యత కార్మికులేదే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ విలీనం డిమాండ్ లేదన్నారు. రూల్స్ ప్రకారం ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. కార్మికులకు లేనిపోని ఆశలు కల్పించి నట్టేట ముంచారన్నారు కేసీఆర్. కార్మికులు అందరూ రేపటి నుంచి విధుల్లోకి రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల పొట్టకొట్టే ఉద్దేశం లేదన్నారు.

అందరూ హ్యాపీగా విధుల్లో చేరాలన్నారు. చక్కగా పని చేసుకోవాలని హితవు పలికారు సీఎం కేసీఆర్. ఈ అర్థరాత్రే ఆర్డర్ ఇస్తామన్నారు. ఇప్పటికిప్పుడు 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఇవ్వటం జరుగుతుందని ప్రకటించారు.

ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ :
ఆర్టీసీ కార్మికులు అందరూ విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్.. మరో కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ మనుగడ సాధించాలంటే ఛార్జీల పెంపు అనివార్యం అన్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కిలోమీటర్ కు 20పైసలు పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. పెంచిన టికెట్ ధరలతో ఆర్టీసీ సంస్థకు 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. పెంచిన ఛార్జీలపై ప్రయాణికులు ఆందోళన పడొద్దన్నారు. ఆర్టీసీ మనుగడ కోసం సహకరించాలని కోరారు.