ఉల్లి పొలాల్లో దోపిడీ దొంగలు : రాయలసీమలో హైఅలర్ట్

271

ఇంట్లో దొంగలు పడ్డారు అని విన్నాం.. బ్యాంకుల్లో పడ్డారంటే కామన్ అనుకుంటాం.. ఇప్పుడు పొలాల్లో దొంగలు పడుతున్నారు.. వినటానికి విచిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. వరి, మిర్చి, పత్తి పొలాల్లో కాదు.. ఇప్పుడు ఉల్లి సాగు చేసే పొలాల్లో దొంగలు పడుతున్నారు. రాత్రికి రాత్రి పంట కోసి ఎత్తుకెళుతున్నారు. ఈ ఘటనలతో రాయలసీమలోని రైతులు హై అలర్ట్ అయ్యారు. ఉల్లి సాగు చేస్తున్న పొలాల దగ్గర రాత్రిళ్లు కాపలా కాస్తున్నారు.

ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా రైతులకు ఈ బెంగ పట్టుకుంది. కిలో ఉల్లపాయల ధర 100 రూపాయలకు చేరుకుంది. ఈ క్రమంలోనే పొలాల్లోని పంటను రాత్రికిరాత్రి కొందరు కోసుకుని వెళ్లిపోతున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పటికే వందల కిలోల పంట దోపిడీకి గురైంది. బహిరంగ మార్కెట్ లో క్వింటా ధర 10వేల రూపాయలు పలుకుతుంది. నలుగురు దొంగలు కలిసి.. తలా 25 కిలోల ఉల్లి దొంగతనం చేసినా 10వేలు వస్తాయి. ఆధారాలు కూడా దొరకవు. రైతు బజార్లలో ఇట్టే అమ్మేయవచ్చు. దీన్ని అలుసుగా తీసుకుని ఉల్లి దొంగలు రెచ్చిపోతున్నారు.

ఉల్లి ధర పెరుగుతున్న కొద్దీ పొలాల్లో పడే దోపిడీ దొంగలు కూడా పెరుగుతుండటంతో రాయలసీమ జిల్లాల్లోని ఉల్లిసాగు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిళ్లు కాపలా కాస్తున్నారు. కొందరు రైతులు అయితే సన్నగా ఉన్నప్పుడే అమ్మేస్తున్నారు. అసలుకే మోసం వచ్చే కంటే.. ఎంతో కొంత ధర వస్తుంది కదా అని డిసైడ్ అయ్యారు.

కలికాలం కాకపోతే ఏంటండీ.. ఉల్లిపాయల దోపిడీ దొంగలు పుట్టుకురావటం ఏంటీ విచిత్రంగా చర్చించుకుంటున్నారు రైతులు…