1999 నుంచే సాయిబాబా జన్మస్థలంపై వివాదం : ఇప్పుడే తెరపైకి ఎందుకు!

174

సాయిబాబా.. కొందరికి ఆరాధ్య దేవుడు. మాటకు ముందు సాయి.. మాట తర్వాత సాయి.. ఇంతటి వీర భక్తులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల సేవలో సాయిబాబా తరలిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు స్వామిగా సాయిబాబాకి విశిష్టమైన స్థానం ఉంది. అలాంటి సాయిబాబా వివాదంలో ఉన్నారు. సాయిబాబా పుట్టింది ఎక్కడ.. ఆయన జన్మస్థానం ఏంటీ అనేది చర్చనీయాంశం అయ్యింది.

సాయిచరిత్రలోనూ సాయిబాబా పుట్టిన గ్రామం, సంవత్సరం, తేదీ లేదు. ఆయన తన 16వ ఏట షిరిడీ వచ్చారని మాత్రమే చెబుతుంది. సాయిబాబా పుట్టింది మహారాష్ట్రలోని షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్బాని జిల్లాలోని పత్రి అనే గ్రామంలో అంటున్నారు స్థానికులు. 1999లోనే అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు స్థానికులు. అయితే షిరిడీ ఉన్నంత పాపులారిటీ జన్మస్థాన్ గా చెబుతున్న పత్రీకి రాలేదు. అప్పటి నుంచే పత్రీ గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఈ వివాదాన్ని నడిపిస్తూనే ఉన్నారు. సాయి జన్మస్థానం పత్రీనే అని.. అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికారికంగా గుర్తించారా ఇప్పుడు :
ఈ గొడవ చాలా కాలంగా ఉన్నా.. ఇప్పుడే వెలుగులోకి రావటం కారణం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే. స్వయంగా ఆయన రగిలించిన చిచ్చు.. ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టింది. పత్రీలోని సాయి జన్మస్థాన్ ఆలయం అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పత్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే గుర్తించినట్లు అయ్యింది. ఈ నిర్ణయంతో షిరిడీ ప్రాముఖ్యతను ప్రభుత్వమే తగ్గించినట్లు అవుతుంది అనేది షిరిడీ ట్రస్ట్ వాదన.