టీటీడీ ఆగమ పండితుల సంచలన నిర్ణయం : శ్రీవారి రోజువారీ సేవలన్నీ రద్దు

58

తిరుమల తిరుపతి ఆగమ సలహామండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వసంతోత్సవాలు, విశేషపూజ, సహస్ర కళషాభిషేకం సేవలను రద్దు చేయాలని దేవస్థానం బోర్డుకు సూచించింది. వసంతోత్సవం, సహస్ర కళషాభిషేకం, విశేష పూజలను రద్దు చేయాలని కోరింది ఆగమ సలహా మండలి. ప్రస్తుతం ప్రతిరోజూ వసంతోత్సవం ఉంటుంది.. ప్రతి సోమవారం స్వామివారికి విశేష పూజ ఉంటుంది. సహస్రకళషాభిషేకం సేవ కూడా ఆయా విశేష రోజుల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సేవలను ఎక్కువగా నిర్వహించటం వల్ల, ప్రతిరోజు స్నపన తిరుమంజనం చేయటం వల్ల మలయప్పస్వామి బింబం అరుగుదల సంభవిస్తుందని ఆగమ సలహా మండలి చెప్పుకొచ్చింది. 600 ఏళ్ల క్రితం లభించిన మలయప్పస్వామి బింబం పరిక్షణ కోసం ఈ సేవలను రద్దు చేయాలని బోర్డును కోరింది మండలి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ సేవలను నిర్వహించాలని కూడా సూచించింది.

కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ సేవలు రద్దు చేయాలని ఆగమ పండితులు సూచించటం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్తానం బోర్డును కూడా ఇరకాటంలో పడేసింది. పండితులు వద్దని చెబుతున్న సేవలను రద్దు చేస్తే భక్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అనే డైలమాలో పడింది. ఈ సేవలకు ఎంతో డిమాండ్ ఉంది. మూడు నెలల ముందే బుక్ చేసుకుంటారు. కొన్ని సేవలను ఏడాది ముందే బుక్ అయిపోతాయి. అలాంటి సేవలు రద్దు చేయటం సాధ్యమేనా అని బోర్డు సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు.

ఆగమ పండితుల సలహా మండలి నిర్ణయంపై జియర్ స్వాములు ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు చర్చకు దారి తీసింది. స్వామివారి సేవలన్నీ కూడా జియర్లు సూచించిన విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో బోర్డు నిర్ణయం ఎలా ఉండబోతున్నది అనేది భక్తుల్లో ఆసక్తి రేపుతోంది