నో సిగ్నల్ : ఐడియా దివాళా తీయనుందా.. మీ ఫోన్లు మూగబోనున్నాయా!

196

ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. మీ ఫోన్లు మూగబోవచ్చు.. మీ సిమ్ కార్డు పనికిరాకుండా ఉండొచ్చు.. భయపెట్టటానికి కాదు ఈ వార్త.. ఐడియా కంపెనీ యాజమాన్యమే ఈ విధంగా భయపడుతోంది. దీనికి కారణం అప్పులు. దేశంలోనే మూడో అతిపెద్ద నెట్ వర్క్ కంపెనీగా ఉంది ఐడియా. దాని అప్పులు కూడా అదేస్థాయిలో 53వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే కంపెనీ మూసివేయటమే అంటూ ఈ సంస్థ చైర్మన్ కుమార మంగళం బిర్లా స్వయంగా ప్రకటించటం సంచలనంగా మారింది. స్పెక్ట్రమ్ చెల్లింపులు, లైసన్స్ ఫీజు బకాయిలు ఇప్పటికే 53వేల కోట్లుగా ఉన్నాయని.. మోడీ సర్కార్ భరోసా ఇవ్వకపోతే కష్టమే అంటున్నారు.

ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు కలిసి మొత్తంగా లక్షా 47 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. అందులో ఐడియా-వొడాఫోన్ వాటానే 53వేల కోట్లు. కనీసం వడ్డీ, జరిమానా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ విధంగా అయినా అప్పులు తగ్గుతాయని భావిస్తున్నారు.
ఇప్పటికే ఐడియా కాల్, డేటా, సర్వీస్ ఛార్జీలను 40శాతం పెంచింది. దీని వల్ల కొంచెం గట్టెక్కవచ్చు అని భావిస్తున్నారు. అయినా కూడా ఇది ఏ మాత్రం ఉపశమనం కాదంటున్నారు ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కష్టాల్లో ఉంది. ఈ టైంలో టెలికాం కంపెనీల అప్పులు మాఫీ చేయటం కష్టం అంటున్నారు నిపుణులు. ఈ రెండు సాధ్యం కాకపోతే ఇక ఐడియా మూసివేత ఖాయంగా కనిపిస్తుంది. మరి కస్టమర్ల సంగతి ఏంటో…