పదేళ్లలో ఒకే ఒక్కడు : మాజీ గవర్నర్ నరసింహన్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు!

457

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన ఆయన ప్రశాంత జీవితం గడుపుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దైవారాధనతో కాలక్షేపం చేస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా ఆడుకుంటున్నారు. చెన్నైలో జరిగే సాహిత్యం, ఇష్టాగోష్టిలకు హాజరు అవుతున్నారంట. అప్పుడప్పుడు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారంట. శాంతిభద్రతల అంశంలో తనకున్న అనుభవాలను.. జూనియర్ ఆఫీసర్లు ఎవరైనా అడిగితే సూచనలు, సలహాలు ఇస్తున్నారంట. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో అత్యంత దగ్గర అయిన మిత్రులతో అప్పుడప్పుడూ ఫోన్ సంభాషణ చేస్తున్నట్లు సమాచారం. మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటున్నారంట.

నరసింహన్.. ఆ మాట చాలు పది సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పాటు వరకు తనదైన ముద్ర వేశారు నరసింహన్. గవర్నర్ అనే పదానికి కొత్త అర్థంతోపాటు తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక ముద్ర వేశారు. ఆధ్యాత్మికతో తనకు తానే సాటిగా నిరూపించుకున్నారు. శాంతిభద్రతల్లో నరసింహుడి అవతారమే ఎత్తారు.. సీఎంలకు తలలో నాలుక అయ్యారు.. ప్రతి ఇట్లో పిల్లాపాపలతోపాటు ప్రతి మహిళకు నోటెడ్ పర్సన్ అయ్యారు నరసింహన్ దంపతులు.

ఎప్పుడూ ఒంటరిగా కనిపించేవారు కాదు. ఆది దంపతులులాగ పక్కన భార్య ఉండాల్సిందే. ఆమె కూడా ఎంతో నిండుగా, భారతీయ సంప్రదాయానికే చిహ్నంగా ఉండేవారు. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే చాలు అందరి దగ్గరకు వెళ్లి ప్రతి ఒక్కరినీ చిరునవ్వులతో పలకరించేవారు.

ప్రభుత్వాలకు సమస్య వస్తే పెద్దన్న పాత్ర పోషించేవారు. సూచనలు, సలహాలు ఇచ్చే వారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల విషయంలోనూ ఆయన వ్యవహారశైలికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా వచ్చినా.. బీజేపీ ప్రభుత్వంలోనూ ఏపీ, తెలంగాణకు ఉమ్మడి గవర్నర్ గా ఐదేళ్లు కొనసాగారు. దాదాపు పదేళ్లు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా కొనసాగటం అంటే మాటలు కాదు. సీఎం కేసీఆర్ తో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత కూడా అతనిదే.

ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన అంశాలు, హైదరాబాద్ పై ఏపీకి హక్కు ఇలాంటి అంశాల్లో తలెత్తిన వివాదాలను ఎంతో చాకచక్యంగా చక్కదిద్దగలిగారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఓటుకి నోటు కేసు వ్యవహారంలో గవర్నర్ పాత్రను విస్మరించలేనిది అంటారు విశ్లేషకులు.

ఏపీ, తెలంగాణలో ఆయన సందర్శించని ఆలయం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎంతో సంప్రదాయబద్దంగా, ఆలయ నియమాలను అనుసరించి మరీ దుస్తులు వేసుకుని ప్రవేశించేవారు. సామాన్య భక్తులు సైతం ఔరా అనే విధంగా తన మొక్కుల చెల్లింపులు ఉండేవి. ఒక్కోసారి మన గవర్నర్ గారేనా అనే డౌట్ వస్తుంది ఆయన్ను చూస్తే. హిందూ ధర్మానికే ఐకాన్ గా నిలిచేవారు. క్రిస్మస్, రంజాన్ వచ్చినా అంతే హడావిడి. ఆయా వేషధారణల్లో విందులు ఇచ్చేవారు.

ప్రస్తుతం 74 సంవత్సరాల నరసింహన్.. కొత్తగా బాధ్యతలు స్వీకరించటానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తెలంగాణ నుంచి కాశ్మీర్ గవర్నర్ గా వెళుతున్నారు అనే వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఆయన అనుభవాలను వినియోగించుకోవాలని అనుకున్నదంట. అయితే వయస్సు రీత్యా అందుకు అంగీకరించలేదంట నరసింహన్. కాకపోతే సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటానని.. ప్రత్యక్ష బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న లక్ష్మీ నరసింహన్.. ఉదయం 5 గంటలకే నిద్ర లేచి.. 8 గంటలకు పూజాది కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారంట. ఆ తర్వాత టిఫిన్ చేసి.. కొద్దిసేపు ఇంటి పనుల్లో బజీ అవుతున్నారంట. మధ్యాహ్నం వరకు పుస్తకాలు, టీవీలు, పత్రికలు చదవటం వ్యాపకంగా పెట్టుకున్నారంట. మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి. సాయంత్రం మాత్రం మిత్రులతో పిచ్చాపాటి చేస్తున్నారు. సాయంత్రం సమయాల్లో ఏదైనా సాహిత్య సభలు, సమావేశాలు ఉంటే వెళుతున్నారు. గుళ్లు, గోపురాలను సందర్శిస్తున్నారు. రాత్రి 9 గంటలకల్లా హాయిగా పడుకుంటున్నారు.
జీవితాన్ని ఎంతో క్రమశిక్షణగా చూసుకునే నరసింహన్.. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు.

2009 డిసెంబర్ 27న అప్పటి ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. 23 జూలై 2019న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులు మారిన.. గవర్నర్ మాత్రం ఒకే ఒక్కరు ఆయనే ఎక్కడు శ్రీనివాస్ లక్ష్మీ నరసింహన్.. ESL నరసింహన్.