బ్రహ్మదేవుని సృష్టి మొదలైన రోజు ‘ఉగాది’..!

95
Ugadi is the starting of Lord Brahma creation
Ugadi is the starting of Lord Brahma creation

ఉగాది కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త సృష్టికే ఉగాది మొదటిరోజు అని అంటారు పెద్దలు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించి, సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందించాడు. ఈ శుభసందర్భంలో ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టిలో తొలియుగానికి తొలిరోజుగా యుగాది గా మారిందని, కాలక్రమేణా ఆ పేరే ఉగాదిగా మారిందని నమ్మిక.

బ్రహ్మదేవుడు జగత్తును చైత్ర మాసంలో శుక్లపక్ష ప్రథమదినమున, సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. ఆనాటి నుంచే గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్షములన్నింటినీ బ్రహ్మదేవుడు ఈ రోజునే ఆరంభించెనని ప్రతీతి. వసంత రుతువు మొదలై, చెట్లన్నీ కొత్త చిగురు తొడిగే ఈ రోజు, కొత్త జీవితానికి నాంది. ఇక చరిత్రకారులు మాత్రం, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన సందర్భంగా ఉగాదిని ఆరంభించారని చెబుతారు.  ఉగ అంటే నక్షత్రగమనం. ఒక నక్షత్ర గమానికి ఆరంభకాలమే ఉగాది అని అర్ధం కూడా ఉంది. ఉత్తరాయణ, దక్షిణాయనములను కలిపి యుగం అంటారు. ఆ యుగానికి ఆది కాబట్టి యుగాది అయింది.

ఉగాది కేవలం తెలుగువారికే కాదు, మరాఠీలకు, తమిళులకు, మళయాళీలకు, సిక్కులకు, బెంగాలీలకు అత్యంత పవిత్రమైన పండుగ. ఏ భాషలో ఏ పేరుతో జరుపుకున్నా, మొత్తంగా ఉగాది అందరికీ ఇష్టమైన పండుగ.